30 March, 2026 | 3:28 AM

నిఘా నేత్రాలకే ఎసరు!

30-03-2026 01:53 AM

మొండికుంటలో దొంగల మాస్టర్ స్కెచ్.. ఏకంగా భద్రతా వ్యవస్థలకే ఎసరు

ఆనవాళ్లు దొరక్కుండా ముందుగానే 

సీసీ కెమెరాల అపహరణ

పంచాయతీ, రైతుల ట్రాక్టర్ల బ్యాటరీలు,

విడిభాగాలు సైతం చోరీ

వెంటనే రాత్రి గస్తీ పెంచాలని పోలీసులకు స్థానికుల డిమాండ్

అశ్వాపురం, మార్చి 29 (విజయక్రాంతి): ప్రజల ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన సీసీ కెమెరాలకే భద్రత కరువైంది. దొంగలను పట్టించాల్సిన ’నిఘా నేత్రాల’నే దుండగులు ఎత్తుకెళ్లిన విస్తుగొలిపే ఘటన అశ్వాపురం మండలం మొండికుంట గ్రామపంచాయతీలో కలకలం రేపింది. ‘ఒక్కో కెమెరా వంద మంది పోలీసులతో సమానం‘ అనుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. దొంగలు ఏకంగా భద్రతా వ్యవస్థలనే టార్గెట్ చేయడం స్థానికంగా సంచలనంగా మారింది.

ఆధారాలు చెరిపేసే పక్కా ప్లాన్..

గ్రామంలో పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు, ప్రజలంతా ఏకమై చందాలు వేసుకుని వేలాది రూపాయలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఏ దొంగతనం చేసినా తమ ఆనవాళ్లు పోలీసులకు చిక్కకూడదనే పక్కా ప్లాన్తో దొంగలు ముందుగా సీసీ కెమెరాలను అపహరించినట్లు స్పష్టమవుతోంది. కెమెరాలను ఎత్తుకెళ్లిన అనంతరం దొంగలు.. పంచాయతీ కార్యాలయానికి చెందిన ట్రాక్టర్ బ్యాటరీని, గ్రామంలోని పలువురు రైతుల ట్రాక్టర్లలోని విలువైన సామాగ్రిని గుట్టుచప్పుడు కాకుండా దొంగిలించారు.

గత భయాలు.. తాజా ఆందోళనలు.. 

గత ఏడాది మల్లెలమడుగు, మొండికుంట గ్రామాల్లో జరిగిన భారీ బంగారు ఆభరణాల చోరీలను జనం ఇంకా మర్చిపోలేదు. ఈ సీజన్లోనైనా భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని ఆశించిన వారికి తాజా ఘటనలు శరాఘాతంగా మారాయి. రక్షణ కవచం లాంటి కెమెరాలే లేకుండా పోవడంతో గ్రామంలో భద్రత పూర్తిగా గాలికి వదిలేసినట్లయిం దని, ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల తక్షణ జోక్యం అవసరం..

భద్రతా వ్యవస్థలనే లక్ష్యంగా చేసుకున్న ఈ దొంగల ముఠా చర్య.. నేరుగా పోలీసులకే సవాల్ విసురుతోంది. పోలీసులు తక్షణమే స్పందించి ముమ్మర దర్యాప్తు చేపట్టాలని, దొంగలను పట్టుకోవడంతో పాటు గ్రామంలో నైట్ పెట్రోలింగ్ (రాత్రి గస్తీ) పెంచాలని స్థానికులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. వెంటనే చోరీకి గురైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తిరిగి ఏర్పాటు చేసి, తమలో మనోధైర్యాన్ని నింపాలని కోరుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.