12 June, 2026 | 2:18 AM

రూ.39,437 కోట్ల చెత్త కుంభ కోణం

12-06-2026 01:21 AM

కర్ణాటకలో సిద్ధరామయ్య హయాంలో ఆమోదం

ఏకపక్షంగా ఒకే సంస్థకు 30 ఏళ్ల కాంట్రాక్టు

హైదరాబాద్‌కు చెందిన రామ్‌కీ సంస్థకు ఆగమేఘాలపై డీల్

డీకే శివకుమార్ సీఎం కాగానే విచారణకు కమిటీ

బెంగళూరు, జూన్ 11: కర్ణాటకలో దాదా పు రూ.39,437 కోట్ల విలువైన భారీ చెత్త కుంభకోణం తీవ్ర కలకలం రేపింది. బెంగళూరు నగరంలో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే 5,200 టన్నుల ఘన వ్యర్థాల నిర్వహణ, సంస్కరణల కోసం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయంలో ఈ రెండు భారీ కాంట్రాక్టులను కేటాయించారు.

ఏకపక్షంగా ఒకే సంస్థ.. అదికూడా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న హైదరాబాద్‌కు చెందిన రామ్‌కీ సంస్థకు 30 ఏళ్ల కాంట్రాక్టును ఆగమేఘాల కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున వివాదమైంది. అప్పట్లో రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ టెండర్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటిని పక్కనబెట్టి మరీ ఈ డీల్‌కు ఆమోదం తెలపడం ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీసింది. ప్రస్తుతం ఈ కుంభకోణం వ్యవహారం ఉన్నతస్థాయి పునఃసమీక్ష, దర్యాప్తు దశలో ఉన్నది.

నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే, జూన్ 4న ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి, నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అటవీ, పర్యావరణ శాఖ అదనపు ప్రధానకార్యదర్శి అంజుమ్ పర్వేజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి పీసీ జాఫర్, గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) చీఫ్ కమిషనర్ ఎం.మహేశ్వరరావు, జీబీఏ చీఫ్.. ఇంజనీర్లతో కూడిన ఈ కమిటీని వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఈ కమిటీ టెండర్ల కేటాయింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై విచారణ జరుపుతోంది.

హైదరాబాద్‌కు చెందిన రామ్‌కీ గ్రూప్‌నకు అనుబంధ సంస్థ అయిన ఢిల్లీ ఎంఎస్‌డబ్ల్యూ సొల్యూషన్స్ లిమిటెడ్‌కు ఈ టెండర్లను బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (బీఎస్‌డబ్ల్యూఎంఎల్) కేటాయించింది. నగరాభివృద్ధి శాఖ ఈ ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచినప్పుడు ఆర్థిక శాఖ నాలుగు ప్రధాన అభ్యంతరాలను రికార్డు చేసింది. రెండు కాంట్రాక్టు ప్యాకేజీలను ఒకే వెండర్‌కు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో నగరం మొత్తం ఒకే ప్రైవేట్ సంస్థ గుత్తాధిపత్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

30 ఏళ్ల సుదీర్ఘ కాల పరిమితిని కాస్తా 10 ఏళ్లకు కుదించాలని, అలాగే ఏటా ఐదు శాతం చొప్పున చక్రవడ్డీ తరహాలో వ్యయాన్ని పెంచే నిబంధనను మార్చాలని ఆర్థిక శాఖ సూచించింది. ఈ నిబంధన వల్ల కాంట్రాక్టు ముగిసే సమయానికి చెల్లింపుల రేటు బేస్ ధర కంటే 430 శాతం పెరుగుతుందని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులో పనులు ప్రారంభం కాకముందే దాదాపు రూ.6,389 కోట్ల అదనపు వ్యయం భారం పడింది.

గతంలోనే.. బీబీఎంపీ బ్లాక్‌లిస్ట్‌లో ‘రామ్‌కీ’

గతంలో మావల్లిపుర ఘన వ్యర్థాల ప్లాంట్ నిర్వహణలో విఫలమైనందుకు రామ్‌కీ గ్రూప్‌ను గత బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన విషయాన్ని కూడా నివేదికలు గుర్తు చేస్తున్నాయి. ఈ టెండర్ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు శోభా కరంద్లాజే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీష్‌కు లేఖ రాశారు.

మొదటి టెండర్ అనుమానాస్పద స్థితిలో రద్దయిందని, రెండో టెండర్‌లో సాంకేతికంగా అనర్హత వేసిన కంపెనీలనే మూడో టెండర్లో అర్హులుగా ఎలా ప్రకటిస్తారని ఆమె ప్రశ్నించారు. నిబంధనలను పారదర్శకంగా వెల్లడించకుండా ప్రైవేట్ ప్రయోజనాల కోసమే ఇలా మార్పులు చేశారని ఆరోపించారు. మూడో టెండర్ నోటిఫికేషన్‌ను నిబంధనల ప్రకారం వార్తాపత్రికలలో కూడా ప్రచురించలేదని, ఇది చట్టవిరుద్ధమని ఆమె లేఖలో పేర్కొన్నారు.