21 March, 2026 | 12:08 PM

గృహ నిర్మాణ శాఖకు భారీ కోత

21-03-2026 01:48 AM
  1. సగానికి తగ్గిన నిధుల కేటాయింపు
  2. గతేడాది 14,154 కోట్లు.. ఈసారి 7,430 కోట్లే

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్‌లో గృహ నిర్మాణ శాఖకు ఈసారి గణనీయమైన నిధుల కోత పడింది. ప్రస్తుత బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి రూ.7,430 కోట్లు మాత్రమే కేటాయించగా, గత బడ్జెట్‌లో ఈ శాఖకు రూ. 14,154 కోట్లు కేటాయించారు. ఒక్క ఏడాదిలోనే రూ.6,724 కోట్ల మేర కోత (47 శాతం) పడింది. సంక్షేమ రంగాల్లో ముఖ్యమైన గృహ నిర్మాణ శాఖకు ఇంత భారీగా నిధులు తగ్గడం రాజకీయంగా, పరిపాలనా పరంగా చర్చనీయాంశంగా మారుతోంది. గత బడ్జెట్‌లో ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని ప్రాధాన్య అంశంగా ప్రకటించింది.

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం, పట్టణాల్లో బలహీన వర్గాలకు గృహాలు, గృహ స్థలాల పంపిణీ వంటి పథకాల కోసం భారీగా నిధులు కేటాయించడం తో హౌసింగ్ రంగానికి ఊతం లభించింది. అయితే ఈసారి బడ్జెట్లో కేటాయింపులు సగానికి పడిపోవడం వల్ల పేదల ఇళ్ల నిర్మాణ పథకాల అమలు మందగించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతు న్నారు. ప్రత్యేకంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వంటి వర్గాలకు ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటి.

గతంలో ప్రారంభించిన గృహ నిర్మాణ పథకాల కింద వేలాది ఇళ్లు నిర్మాణ దశలో ఉండగా, ఇప్పుడు నిధు ల కొరత వల్ల ఆ పనులు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాణ వ్యయాలు పెరగడం, నిర్మాణ సామగ్రి ధర లు అధికంగా ఉండటం వంటి కారణాలతో గృహ నిర్మాణ రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో నిధులు తగ్గడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టం కావచ్చని ఆర్థిక విశ్లేషకులు చెపుతున్నారు.

మరోవైపు ప్రభుత్వం ఈసారి ఇతర ప్రాధాన్యతా రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించిన నేపథ్యం లో గృహ నిర్మాణ శాఖకు నిధులు తగ్గించినట్టు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు, ఇళ్ల నిర్మాణం ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన కుటుంబాలు ఈ బడ్జెట్‌పై ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది.  వచ్చే నెలల్లో ప్రభుత్వం అదనపు నిధులు విడుదల చేస్తుందా? లేదా ఇప్పటికే ఉన్న నిధులతోనే పథకాలను అమలు చేస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.