21 April, 2026 | 7:48 PM

ప్రతి విద్యార్థి పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి

21-04-2026 06:20 PM

- ప్రభుత్వ విద్యకు భారీ ప్రోత్సాహం

- 18 జూనియర్ కళాశాలల 151 మంది విద్యార్థులకు రూ.24.50 లక్షలు

-  పేద విద్యార్థులకు అండగా ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు

మునుగోడు,(విజయక్రాంతి): ప్రతి విద్యార్థి భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడేలా ఎదిగి పదిమందికి సహాయం చేసే స్థాయికి చేరాలని  కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పేద విద్యార్థుల చదువుకు చేయూతనిస్తూ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే దంపతులు మరోసారి తమ సేవా భావాన్ని చాటుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (2025–26)లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన 151 మంది విద్యార్థులకు మొత్తం రూ.24.50 లక్షల నగదు బహుమతులు, జ్ఞాపికలను అందజేసి మాట్లాడారు.

ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను ప్రోత్సహించడం సమాజం బాధ్యత అని అన్నారు. “నేను బడిని గుడితో సమానంగా చూస్తాను” అని పేర్కొన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లు, డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్య రంగాల్లో పెద్ద మార్పులు తీసుకురావడం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఇలాంటి ప్రోత్సాహకాల వల్ల పేద తల్లిదండ్రుల్లో ధైర్యం పెరిగి, విద్యార్థుల్లో పోటీ తత్వం పెరుగుతోందని తెలిపారు. గత సంవత్సరం కూడా 189 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించినట్లు గుర్తు చేశారు.మనకోసం మనం బ్రతకడం కాదు… మన చుట్టూ ఉన్న వారి కోసం బ్రతకడమే గొప్పతనం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.