13 August, 2026 | 10:52 PM

ఎమ్మెల్యే పేరు లేకుండా సమావేశం.. వాయిదా

13-08-2026 08:26 PM

కొల్చారం: మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఆహ్వాన పత్రికలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పేరు లేకపోవడంతో ఈ నెల 11న నిర్వహించాల్సిన సమావేశం వాయిదా పడింది. శుక్రవారం (14న) మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే సమావేశం నిర్వహించనున్న విషయాన్ని స్థానిక విలేకరులకు సైతం ఎంపీడీవో కార్యాలయం సమాచారం ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. సర్పంచులు ఎన్నికై ఏడు నెలలు పూర్తయినా ఇప్పటివరకు మండల పరిషత్ కార్యాలయంలో ఒక్క సాధారణ సమావేశం కూడా నిర్వహించకపోవడంపై పలువురు ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సర్పంచులకు అందని ఆహ్వానాలు

శుక్రవారం నిర్వహించనున్న సమావేశానికి ఇప్పటివరకు తమకు ఆహ్వానం అందలేదని మండలంలోని పలువురు సర్పంచులు తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజలతో నేరుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా ఉన్న సర్పంచులతో మండల సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే పేరు లేకపోవడంతో వాయిదా

స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే, ఆమె పేరు ఆహ్వాన పత్రికలో లేకుండానే ఈ నెల 11న సమావేశం ఏర్పాటు చేయడంపై ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పేరు లేకుండానే సమావేశం ఏర్పాటు చేసి అనంతరం వాయిదా వేయడంపై బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ వాయిదా పడుతుందా?

శుక్రవారం జరిగే సమావేశంలో మండలంలోని ప్రధాన సమస్యలు ఎంతవరకు చర్చకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. సమావేశంలో ప్రజాప్రతినిధులు ఎంపీడీవో వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ కూడా సాగుతోంది. ఈసారి సమావేశం సజావుగా జరుగుతుందా, లేక మరోసారి వాయిదా పడుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం విషయమై ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా బేగంను వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.