భారీ కంటైనర్ లారీ - మినీ ఆటో ఢీ
ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
గుమ్మడిదల, ఆగస్టు 13 : భారీ కంటైనర్ లారీ, మినీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన గుమ్మడిదల పోలీస్‌స్టేషన్ పరిధిలోని 765డీ ప్రధాన రహదారిపై గురువారం చోటుచేసుకుంది. నల్లవల్లి బస్టాండ్ సమీపంలోని మేడలమ్మ టెంపుల్ కమాన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం నర్సాపూర్ వైపు నుంచి పెద్ద పైపులను తరలిస్తున్న భారీ కంటైనర్ లారీ మేడలమ్మ టెంపుల్ కమాన్ వద్దకు చేరుకోగానే, ఎదురుగా వస్తున్న నిత్యం పాలను తరలించే మినీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురిలో శివకుమార్ అనే వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.
దయానంద్, సతీష్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే అంబులెన్స్‌లో సూరారం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుడు శివకుమార్‌తో పాటు గాయపడిన దయానంద్, సతీష్‌ది నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వారిని స్థానికులు తెలిపారు.
ముగ్గురూ మిత్రులని, ప్రతిరోజూ గ్రామం నుంచి పాలను సేకరించి పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ పాల వ్యాపారం చేసేవారని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు గుమ్మడిదల ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. కాగా ప్రమాదంలో భారీ కంటైనర్ రహదారిపై నిలిచిపోవడంతో ఇరువైపులా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రధాన రహదారిపై దాదాపు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న గుమ్మడిదల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ప్రమాద సమయంలో స్పందించిన ఎమ్మెల్యే...
ప్రమాదం జరిగిన సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఘటనను గమనించి వెంటనే స్పందించారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేందుకు సహకరించారు. వెంటనే సంఘటన స్థలానికి అంబులెన్సులు చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.






