13 August, 2026 | 11:21 PM

ఇప్పటికీ నాకు కారు లేదు.. బైక్ మీదే వస్తా!

13-08-2026 10:20 PM

కామాక్షి భాస్కర్ల ఎంచుకునే సినిమాలు, కథలు, సాధిస్తున్న విజయాల గురించి అందరికీ తెలిసిందే. కంటెంట్ ఓరియెంట్ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతున్న కామాక్షి భాస్కర్ల ఆగస్టు 14న ‘అగధ’ అంటూ రాబోతోన్నారు. ఈ సినిమాని శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎంఎస్ రాజు తెరకెక్కించారు. ఈ మూవీలో కామాక్షి భాస్కర్లతోపాటు శ్రవణ్‌రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భానుచందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయారాణిరెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్యపాత్రలను పోషించారు. శుక్రవారం సినిమా విడుదల అవుతున్న సందర్భంగా కామాక్షి భాస్కర్ల మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివీ.. 

ఎంఎస్ రాజు నన్ను పిలిచారంటే కచ్చితంగా ఏదో ఒక కొత్త పాయింట్, ముఖ్యమైన పాత్రే అయి ఉంటుందని అర్థమైంది. ‘అగధ’ కథ, నా పాత్ర చెప్పిన తర్వాత మరింతగా నచ్చేసింది. నేనెప్పుడూ జయాపజయాల గురించి పట్టించుకోను. ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తా. రాజుతో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ వస్తుందని కూడా ఈ మూవీకి ఓకే చెప్పా. 

‘అగధ’లో ప్రతీదీ ఎంఎస్ రాజు విజన్ అని చెప్పుకోవచ్చు. ప్రతీదీ విభిన్నంగా ఉండాలని ముందే ఆయన అనుకున్నారు. అలాంటి చీరకట్టులో నాకు కాస్త ఇబ్బంది అనిపించింది. ‘అగధ’లోని యాక్షన్ సీక్వెన్స్ కోసం మేం ముందుగానే వర్క్‌షాప్స్, రిహార్సల్స్ చేశాం.  

‘అగధ’ జర్నీలో మహాదేవి పాత్ర కోసం మారేందుకు నాకు టైమ్ పట్టింది. కామాక్షిగా నన్ను నేను పక్కనపెట్టి, నా ప్రిన్సిపల్స్ పక్కన పెట్టి ఆ పాత్ర కోసం మారడానికి ఇబ్బంది అనిపించింది. దేవుడి అనుగ్రహంతో పుట్టే పాత్ర అది. బుద్ధిజం పుస్తకాల్ని చదివా. బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నా. ప్రతీ ముద్ర గురించి, ఆ పాత్ర నడవడిక గురించి అర్థం చేసుకుని నటించా. సినిమాలో ఎక్కడా కూడా కామాక్షి కనిపించకూడదని జాగ్రత్తలు తీసుకున్నా. 

శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అంత పెద్ద నిర్మాత నన్ను అనుష్కతో పోల్చడం ఆనందంగా అనిపించింది. ఆమెతో పోల్చడం అనేది నన్ను మరింత బాధ్యతగా ఉండేలా చేస్తుంది (నవ్వుతూ). 

ఇండస్ట్రీలో నా తొమ్మిదేళ్ల జర్నీని గుర్తు చేసుకుంటూ అంతగా ఎమోషనల్ కావడానికి కారణం ఉంది. ఎందుకంటే మేల్ చేసినప్పుడు మేల్ సెంట్రిక్ సినిమాలు అనరు. కానీ ఫీమేల్ చేస్తే మాత్రం ఫీమేల్ సెంట్రిక్ సినిమా అంటారు. ఇంట్లో మహిళలు మల్టీపుల్ టాస్కులు చేస్తుంటారు.

స్క్రీన్ మీద ఫీమేల్ కారెక్టర్స్ ఇండిపెండెంట్‌గా ఎందుకు ఉండకూడదు అని అనుకునేదాన్ని. 2019 నుంచి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. చిన్న చిన్న పాత్రల కోసం ఎన్నో ఆడిషన్స్ ఇచ్చా. నేను సినిమాల కోసం ఎంతో కష్టపడ్డా. ఇప్పటికీ నాకు కారు లేదు. బైక్ మీదే వస్తా. ఇప్పుడు అందరూ రోడ్ల మీద గుర్తు పట్టి నన్ను ఫాలో అవుతున్నారు (నవ్వుతూ). ప్రొడక్షన్ వాళ్లు ఇచ్చే వెహికల్ కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది. మాది మిడిల్ క్లాస్ కావడంతో మాకు కారు పెద్ద విషయం (నవ్వుతూ).

ఇంకా నా జర్నీలో నాకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పాలంటే.. సత్యం రాజేశ్ పక్కన చేసిందా? అయితే వద్దు అని నా ముందే చాలా మంది అన్నారు. ఎవరి పక్కన చేస్తున్నామో కూడా ఇక్కడ చూస్తున్నారు. అది చాలా తప్పు.

నాకు వస్తున్న అవకాశాల్లో జానర్స్ రిపీట్ అవుతున్నా పాత్రలు మాత్రం కొత్తగానే ఉంటున్నాయి. ఓ సినిమాను కామాక్షి భుజానికి ఎత్తుకుని ముందుకు తీసుకు వెళ్లగలదనే నమ్మకాన్ని ఏర్పర్చాలి. కొన్ని సినిమాల్ని డబ్బుల కోసం చేస్తాం. ఇంకొన్ని మనల్ని మనం సంతృప్తి పర్చుకునేందుకు చేస్తుంటాం. చిన్న అవకాశం, పెద్ద అవకాశం అని నేను చూడను. వచ్చిన అవకాశాల్లో నాకు నచ్చిన పాత్రను ఎంచుకుంటా. నెక్స్ నేను ఓ లవ్‌స్టోరీకి సైన్ చేశా. ‘పొలిమేర’, ‘అగధ’ వంటి చిత్రాలకే సూట్ అవుతాను అని అనుకునే విషయాన్ని నేను బ్రేక్ చేస్తా.

ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు నచ్చదు. పైగా మన ఇంట్లోని మహిళలను రిప్రజెంట్ చేసే కారెక్టర్స్‌ను పోషించాలని అనుకుంటున్నా. మన ఇంట్లో వాళ్లు నన్ను తెరపై చూస్తే.. అరె నాలానే ఉందే అని అనిపించాలి. ఓ తెలుగమ్మాయిగా.. మన తెలుగు అమ్మాయిలా పాత్రల్ని తెరపై నేను రిప్రజెంట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు. అందుకే నాకు గ్లామర్, క్వీన్ వంటి పాత్రల కన్నా.. సాధారణ మహిళా పాత్రలే ఇష్టం. 

డాక్టర్ వృత్తికి కాస్త గ్యాప్ ఇచ్చా. నేను అక్కడ ఉండే కంటే ఇక్కడే ఇండస్ట్రీలో ఉండాలని అనుకుంటున్నా. నాలాంటి సాధారణ మహిళల్ని రిప్రజెంట్ చేయాలని, తెరపై వారందరినీ చూపించాలని అనుకుంటున్నా. ఇంతవరకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా, రైటింగ్ టీమ్‌లోనూ పనిచేశా. నాకు దర్శకత్వం వహించాలనే ఆలోచన కూడా ఉంది. కానీ ఇప్పుడు కాదు. దానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది.