22 August, 2026 | 11:58 PM

అభివృద్ధి పథంలో మండలం

22-08-2026 11:03 PM

మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండలం అభివృద్ధి పథంలో పయనిస్తుందని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహరావు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎం.ఎస్‌.ఎస్‌. శారదాదేవి అధ్యక్షతన శనివారం మండలస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై బండారు నరసింహారావు మాట్లాడుతూ  డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచనలతో మార్గదర్శకత్వంలో  మండలం అభివృద్ధి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. బట్టి విక్రమార్క అనేక అభివృద్ధి కార్యక్రమాలు  చేపడుతూ నిధులు వెచ్చించి మండలాన్ని అని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. 

మండలంలో అన్ని గ్రామాలలో సిసి రోడ్లు నిర్మిస్తున్నామని, అన్ని గ్రామాలకు రోడ్ల వసతిని  కల్పిస్తున్నామని, రేషన్ కార్డులు అందరికీ ఇస్తున్నామని, సోమవారం నుండి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, రైతులందరికీ రుణమాఫీ సౌకర్యం కల్పించామని, రైతు భరోసా అందిస్తున్నామని, గ్యాస్ సబ్సిడీని అందిస్తున్నామని వివరించారు. విద్యార్థులకు పాఠశాలలో అల్పాహార సౌకర్యం కల్పించి పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ ను అందిస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన పంటలను మార్కెట్లకు తరలించి తమ ఉత్పత్తులకు భద్రత కల్పిస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను వెల్లడించారు. అనంతరం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పాఠశాలల అభివృద్ధి, వివిధ శాఖల ప్రగతి తదితర అంశాలపై చర్చించారు. మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో  మండల ప్రత్యేక అధికారి ఫిరంగి, తహసీల్దార్ సునీతా ఎలిజబెత్,ఎంపీడీవో ఎం.ఎస్‌.ఎస్‌. శారదాదేవి, ఎంపీఓ కృష్ణ, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.