నేటి నుంచి మండలస్థాయి ప్రజావాణి
జిల్లా కేంద్రానికి వెళ్లే పనిలేదు: ఎంపీడీవో బాలరాజు
గుండాల, ఆగస్టు 16 (విజయక్రాంతి): ప్రజల సమస్యలను మరింత సులభంగా పరిష్కరించేందుకు నేటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బాలరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నుండి ప్రతీ సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణీ కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తామని, మండల ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను సంబంధిత అధికారులకు నేరుగా సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ప్రజల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహిస్తున్నందున తమ సమస్యలు చెప్పుకునేందుకు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మండల ప్రజావాణీలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు, వినతులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణీలో సమర్పించాలని ఆయన కోరారు.






