బస్సు ఢీకొని వ్యక్తి మృతి
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి, మృతి. ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఏమిలి అరుణ్ (45) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... అరుణ్ పండ్లు కొనుగోలు చేయడానికి ఎల్లారెడ్డి బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళ్లి, తిరిగి బయటకు వస్తున్న సమయంలో కామారెడ్డి నుండి వచ్చిన ఆర్టీసీ బస్సు (నంబర్: TS16 UB 3110) అతడిని ఢీకొట్టింది. ఈ బస్సును కామారెడ్డి డిపోకు చెందిన డ్రైవర్ ధరావత్ కిషోర్ అతివేగంగా నడుపుతున్నట్లు అందిన సమాచారం అని అన్నారు.
ఈ ప్రమాదంలో అరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి అతడిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం, ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ ఆసుపత్రికి, తరలించగా, చికిత్స పొందుతూ అరుణ్ మృతి చెందాడనీ,మృతుడి తల్లి సురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు.






