7 July, 2026 | 9:40 PM

దుష్ప్రచారాలు మానుకోవాలి

07-07-2026 08:22 PM

- అభివృద్ధికి అడ్డుపడుతున్నారు 

- కాంగ్రెస్ నాయకులు 

చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ, చెన్నూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఓర్వలేక కొందరు బి.ఆర్.ఎస్. నాయకులు మంత్రి వివేక్ వెంకటస్వామి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చెన్నూర్ నియోజకవర్గంలోనీ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు, సోమనపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, చెన్నూర్ పట్టణంలో వంద పడకల ఆసుపత్రి, బస్సు డిపో, అంబేద్కర్ చౌక్ నుంచి చెరువు కట్ట వరకు రోడ్డు విస్తరణ, అలానే పట్టణంలో అంతర్గత సిమెంట్ రోడ్లు, అమృత్ స్కీం కింద మూడు త్రాగునీరు ట్యాంకుల నిర్మాణము, మొదలైన అభివృద్ధి పనులను ఓర్వలేక కొందరు బీఆర్ఎస్ నాయకులు పని కట్టుకొని మైనార్టీ హాస్టల్ కి వెళ్లి భోజనం చేసిన తర్వాత రాత్రిపూట పిల్లల ప్లేట్లలో కారపు పొడి వేసి రోజు ఇలాంటి భోజనం పెడుతున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుంటే సంబంధిత కలెక్టర్ కి ఫిర్యాదు చేయవచ్చు కానీ మంత్రిని 100 ఫీట్ల లోతు బొంద పెడతామని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అక్రమాలకు ఇసుక దందాకు పాల్పడితే మంత్రిగారు అతని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. దానినీ దృష్టిలో పెట్టుకొని మంత్రి మీద ఇష్టమైన రీతిలో మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు.

పిల్లలకు సంబంధం లేని వ్యక్తులు రాత్రి వేళ హాస్టల్ లో దౌర్జన్యంగా ప్రవేశిస్తే పోలీసు కేసులు నమోదు చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రౌడీ మాటలు రౌడీ చేష్టలు బిఆర్ఎస్ నాయకులు అనుసరిస్తున్నారని ఇది ప్రజాస్వామ్యంలో కుదరని పని అని వారు ఎద్దేవా చేశారు. మినిస్టర్ మీద అనుచిత వాక్యాలు చేసి తీవ్రమైన పరుష పదజాలంతా దూషించినందుకు అతని మీద పోలీస్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇంకోసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే అనవసర విషయాలకు మంత్రినీ నిందిస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.