4 April, 2026 | 4:16 AM

రిజిస్ట్రేషన్ల దందా

04-04-2026 02:18 AM

సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపాదన బట్టబయలు 

  20 మంది అనధికార డాక్యుమెంట్ రైటర్లు

రూ.24.61 లక్షల నగదు, 819 గ్రాముల బంగారు నగలు, 2.600 కిలోల వెండి స్వాధీనం

ఏడాదికాలంగా 42 లక్షలు లంచం తీసుకున్న అధికారులు 

ఏసీబీ దాడుల్లో వెలుగుచూసిన బాగోతం

మహబూబాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా వడ్డేపల్లి లోని 1,2 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి, అక్రమాలకు అడ్డాగా మారింది. ఆయా కార్యాలయాల సబ్ రిజిస్ట్రార్లు డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు, దస్తావేజులు ఇస్తారు. లేదంటే తమ వద్దే పెట్టుకుని ముప్పుతిప్పలు పెడతారు. ప్రైవేటు వ్యక్తులతో కలిసి ఆ అధికారులు లంచాలకు అలవాటు పడ్డారు. దీంతో విసిగిపోయిన వారు కొంతమంది ఏసీబీని ఆశ్రయించారు.

దీంతో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు ఆయా కార్యాలయాలపై గురువారం మెరుపు దాడులు నిర్వహించగా సబ్ రిజిస్ట్రార్ల అవినీతి బాగోతం బట్టబయలైంది. సబ్ రిజిస్ట్రార్ల అక్రమాలతో పాటు అనధికార డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ నడుస్తున్నట్లు గుర్తించారు. ఈ సోదాల్లో రూ.24.61 లక్షల నగదు, 819 బంగారు నగలు, 2,600 కిలోల వెండిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ంలో 20 మంది అనధికారిక ఏజెంట్లు, డాక్యుమెంటరీ రైటర్లు పనిచేస్తున్నట్లు గుర్తించారు.

ప్రాథమిక ఆధారాల మేరకు సబ్ రిజిస్ట్రార్లు 1,2 రామ నర్సింహరావు, ఆనంద్‌కు చెందిన హైదరాబాద్, ఖమ్మం నివాస గృహాల్లో శుక్రవారం దాడులు నిర్వహించారు. డాక్యుమెంట్ రైటర్ల మొబైల్ ఫోన్లను పరిశీలించగా సబ్ రిజిస్ట్రార్ 1,2 అధికారులు జమలాపురం రామ నర్సింహరావు, దావులూరి ఆనంద్‌లతో వాట్సాప్ చాట్స్ ఉన్నట్లు గుర్తించారు. గత ఏడాది కాలంలోనే డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ఈ ఇద్దరు అధికారులు సుమారు రూ.42 లక్షలు లంచంగా తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

అలాగే సబ్ రిజిస్ట్రార్ అధికారుల వద్ద కొనుగోలుదారులకు ఇవ్వకుండా 204 రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇద్దరు అధికారుల ఇళ్లలో ఏకకాలంలో నిర్వహించిన తనిఖీల్లో దావులూరి ఆనంద్ నివాసం నుంచి రూ.24,61,540 నగదు, 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.600 కిలోల వెండి ఆభరణాలు, అలాగే కపిల్ చిట్స్‌లో రూ.30,10,000 విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ తనిఖీల్లో మరిన్ని అవకతవకలు బయటపడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించి తదుపరి చర్యలు తీసుకుంటామని, లంచం ఎవరైనా అడిగితే తమకు ఫిర్యాదు చేయాల ని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.