ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
సామాజిక విప్లవకారుడి ఆశయ సాధనకు పునరంకితం కావాలన్న బీసీ నాయకులు
పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి బీసీ నాయకుల నివాళులు
ముత్తారం,(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా ముత్తరం మండల కేంద్రంలో బీసీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అలువోజు రవీందర్, ఉప సర్పంచ్ అమ్ము రజిత శ్రీనివాస్, మండల బీసీ సంఘం అధ్యక్షుడు చల్ల సమ్మయ్య, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పప్పు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం పూలే చేసిన పోరాటం మరువలేనిదన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్యను అందించి వారి అభివృద్ధికి పునాదులు వేసిన గొప్ప సంస్కర్త పూలే అని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగడమే పూలేకు మనం ఇచ్చే నిజమైన గౌరవమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పింగళి మౌనిక సురేందర్, నాయకులు పింగళి యుగంధర్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ ఉపాధ్యక్షుడు గట్టు రమేష్, చొప్పరి శివరాజం, బండి రవి తదితరులు పాల్గొన్నారు.




