23 June, 2026 | 6:27 PM

మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం

23-06-2026 05:14 PM

- ఎస్సీ వర్గీకరణ ఫలాలను అందిపుచ్చుకుని విద్య, ఉద్యోగాల్లో రాణించాలి

- ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి మంద కుమార్ మాదిగ

గజ్వేల్: మాదిగ సామాజిక వర్గంలో అక్షరాస్యతను పెంచడం, డ్రాప్‌అవుట్లను తగ్గించడం, విద్యా అవకాశాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జూలై 5 వరకు 40 రోజుల పాటు "గో టు విలేజ్" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి మంద కుమార్ మాదిగ తెలిపారు. గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మార్పీఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి బుడిగే మహేష్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా మంద కుమార్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, విద్యా, ఆర్థిక, ఉపాధి మరియు రాజకీయ కుల సర్వే (ఎస్‌ఈఈఈపీసీ) నివేదిక ప్రకారం మాదిగలు అక్షరాస్యతలో వెనుకబడిన వర్గంగా ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రతి గ్రామంలో చైతన్య సమావేశాలు నిర్వహించి విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారని చెప్పారు.

ప్రస్తుతం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలులో ఉన్న నేపథ్యంలో మాదిగలు తమకు లభిస్తున్న 9 శాతం రిజర్వేషన్ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల కారణంగా విద్యకు దూరం కాకుండా విద్యార్థులు ఉన్నత చదువుల వైపు అడుగులు వేయాలని సూచించారు. మాదిగ సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే ప్రధాన ఆయుధమని పేర్కొంటూ, 30 ఏళ్ల పోరాట ఫలితంగా సాధించిన ఎస్సీ వర్గీకరణ ప్రయోజనాలను ఉపయోగించుకుని ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మాదిగ యువత ముందంజలో నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే మాదిగ జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా గద్దెలను నిర్మించాలని, జూలై 7న ఎమ్మార్పీఎస్ జెండా పండుగను మాదిగ జాతి పండుగగా ఘనంగా నిర్వహించాలని కోరారు.