లింగమంతుల స్వామి..పరిహారం రాదేమి!
గొల్లగట్టు జాతరకు పొలాలు.. ఇప్పటికీ అందని పరిహారం
- ఏడాదిన్నరగా అందని రూ.12.50 లక్షలు
- పరిహారం అందించాలని రైతుల వేడుకోలు
చివ్వెంల, ఆగస్టు 8: రాష్ట్రంలో అత్యంత వైభవం గా, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే జాతరల్లో 2వ అతిపెద్ద జాతర సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని శ్రీ లింగమంతుల స్వామి (గొల్లగట్టు) జాతర. జాతర కోసం తమ పంట పొలాలను అప్పగించిన రైతులు నేడు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. భక్తుల కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిహారం మాత్రం జాతర ముగిసి ఏడాదిన్నర దాటినా అందకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
గతంలో ప్రతి జాతరకు ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించేవారని రైతులు గుర్తు చేస్తున్నారు. 2025 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు సుమారు 50 ఎకరాల భూమిని వినియోగించడంతో మొత్తం రూ.12.50 లక్షలు రైతులకు చెల్లించాల్సి ఉన్నా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతర సందర్భంగా రైతుల పంట పొలాలనే పార్కింగ్ స్థలాలుగా, శిబిరాలుగా, వంట ప్రదేశాలుగా మార్చారని రైతులు చెబుతున్నారు.
వేలాది మంది భక్తులు పొలాల్లోనే వంటలు చేసుకొని, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం అక్కడే వదిలి వెళ్లారని, తాత్కాలిక మరుగుదొడ్ల కోసం గుంతలు తవ్వడంతో భూములు దెబ్బతిన్నాయని వాపోతున్నారు. పొలాల్లోని వరాలు, కంచెలు ధ్వంసమవగా, జాతర ముగిసిన తర్వాత ఆ చెత్తను తొలగించి భూములను మళ్లీ సాగుకు సిద్ధం చేసుకోవడానికి తామే వేల రూపాయలు ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు.
హామీలే.. పరిహారం లేదు
పరిహారం కోసం రైతులు జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అయితే ప్రతిసారీ ‘ఇస్తాం‘, ‘త్వరలో విడుదల చేస్తాం‘ అనే మాటలే వినిపించాయి కానీ పరిహారం మాత్రం విడుదల కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో మళ్లీ గొల్లగట్టు జాతర జరగనుంది. కానీ గత జాతరకు సంబంధించిన బకాయిలే ఇంకా చెల్లించకపోవడం రైతులను కలవరపెడుతోంది. తమ హక్కుగా రావాల్సిన రూ.12.50 లక్షల భూ పరిహారాన్ని వెంటనే విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పరిహారం వెంటనే ఇవ్వాలి
మాది వ్యవసాయ కుటుం బం. 2025లో జరిగిన గొల్లగట్టు జాతర కోసం మా రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేయకుండా ప్రభుత్వ అవసరాలకు ఇచ్చాం. ఎకరానికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.62,500 నగదు పరిహారం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ జాతర ముగిసి ఏడాదిన్నర గడిచినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందలేదు. అధికారులు స్పందించి పరిహారాన్ని విడుదల చేయాలి.
పేరాల వీరస్వామి, రైతు
పరిహారం ఇంకా అందలేదు
రెండు ఎకరాల వ్యవసాయ భూమిని 2025 ఫిబ్రవరిలో జరిగిన గొల్లగట్టు జాతర కోసం ఇచ్చినా. ఇప్పటి వరకు పరిహారం అందలేదు. జాతర కోసం వినియోగించిన భూమికి ఎకరానికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.50 వేల పరిహారం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఏడాదిన్నర గడిచినా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.
మద్ది జానకిరాములు, రైతు






