ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి
రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
సూర్యాపేట, మే 15 (విజయక్రాంతి) : స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. సూర్యాపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన తూర్పు తెలంగాణా ప్రాంతీయ స్థానిక సంస్థల సదస్సులో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని దేవి, సభ్యురాలు సుజానా యాదవ్, సభ్యుడు ఎస్.సుధీర్ రెడ్డిలతో కలిసి పాల్గొని మాట్లాడారు. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమనే విషయమును దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వాములు చేస్తూ, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.
ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకుని, పల్లె, పట్టణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాస్త్రీయ దృక్పథం తో పని చేయాలన్నారు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణం జరిగి, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే ఆర్థిక సంఘం ధ్యేయమన్నారు. ఆర్థిక అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు సమసిపోయి, మానవ సంపద, వారి శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడేలా కృషి జరగాలన్నారు. ఈ దిశగా ప్రజలకు, ప్రభుత్వానికి కమిషన్ వారధిగా నిలుస్తూ సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఫైనాన్స్ కమిషన్ సూచనలు చేస్తుందని తెలిపారు.
అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో ప్రతి నివాస గృహానికి రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా, పారిశుధ్య నిర్వహణ పక్కాగా కొనసాగేలా స్థానిక సంస్థలు నిశిత పర్యవేక్షణ చేయాలన్నారు. ఇటీవలే కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, మేయర్లు, చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, స్థానిక సంస్థల బలోపెతంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. నిధుల కోసం పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఆధారపడకుండా స్థానికంగా ఆదాయం సమకూర్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
స్థానిక సంస్థలలో ఆదాయ వనరులు పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల నుండి సలహాలు స్వీకరించారు. తదుపరి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామాలను, మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నగర మేయర్లు, ఛైర్పర్సన్ లు, ఎక్స్ ఎం.పి.టి.సి.లు, ఎక్స్ జడ్.పి.టి.సి లు సర్పంచులు, మునిసిపల్ కమీషనర్ లు, డిపిఓ లు, ఎంపిడిఓ లు, ఎన్జిఓస్, సూర్యాపేట అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, నల్గొండ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,సూర్యాపేట జెడ్పీ సీ.ఈ.ఓ డి. శిరీష, నల్గొండ జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీపీఓ యాదగిరి, డిఎంహెచ్వో వెంకటరమణ డీఎల్పీఓలు, ఎంపీఓలు, ఎంఈఓ లు గ్రామపంచాయతి కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






