8 May, 2026 | 4:42 PM

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. విజయ్‌కు వామపక్షాల మద్దతు

08-05-2026 04:07 PM

చెన్నై: తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొలిక్కి వస్తోంది. టీవీకే(Tamilaga Vettri Kazhagam) విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు వామపక్షాలు అంగీకరించాయి. విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి సీపీఐ, సీపీఎం, వీసీకేల పార్టీలు సమ్మతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇప్పటికే టీవీకేకు మద్దతు ప్రకటించింది. లెఫ్ట్, కాంగ్రెస్, వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరుకుంది. కాంగ్రెస్(5), సీపీఐ(2), సీపీఎం(2), వీసీకే(2) సీట్లు టీవీకేకు మద్దతు తెలిపాయి.

దీంతో టీవీకే అధినేత విజయ్(TVK Chief Vijay) మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. విజయ్ ఇప్పటికే రెండుసార్లు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కలిశారు. సాయంత్రం 4:30  కు గవర్నర్ తో విజయ్ సమావేశం కానున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరనున్నారు. మెజార్టీ సభ్యుల జాబితా ఇవ్వాలని ఇప్పటికే గవర్నర్ విజయ్ కు సూచించారు. అటు ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై చెప్పింది. కాంగ్రెస్ తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటన విడుదల చేసింది. తమిళనాడులో మూడు రోజులుగా సాగుతున్న రసవత్తర రాజకీయాలకు కాసేపట్లో తెరపడే అవకాశముంది.  

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్టీ మనస్ఫూర్తిగా అంగీకరిస్తుందని, తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ శుక్రవారం తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి ప్రజల తీర్పు గానీ, ఆ అవకాశం గానీ లభించలేదని నాగేంద్రన్ పేర్కొన్నారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా జరిగే ఏ ప్రయత్నంతోనూ తమ పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు.