14 July, 2026 | 10:02 AM

వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం

14-07-2026 08:46 AM

రూ.2,147 కోట్ల అభివృద్ధి నిధులు తెచ్చాం.. 

బీఆర్ఎస్‌కు ప్రజలు ఇప్పటికే తీర్పు చెప్పారు – 

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పనిచేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లో రూ 359 కోట్లతో రహదారి విస్తరణ కు మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఎమ్మెల్యే మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ శివ సేనా రెడ్డి తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం జిల్లా కేంద్రం లోని రాజీవ్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాయకత్వం, సహకారం వల్లే తాను ఎమ్మెల్యేగా నిలబడగలిగానని, ఆయన మార్గదర్శకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. 2018 వరకు వనపర్తిలో గులాబీ మొక్కలు కనిపించాయని, కానీ 2018 నుండి 2023 వరకు గంజాయి మొక్క కనిపించదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్‌కు 2023 ఎన్నికల్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అన్నారు.

"అన్నీ నేనే చేశానని చెప్పుకోవడం సరికాదు "

నియోజకవర్గంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనినీ తానే చేశానని గతంలో కొందరు చెప్పుకోవడం సరైంది కాదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వం సమిష్టిగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌లో ఉంటూ ప్రజలకు దూరంగా ఉన్న నాయకులు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మధ్య ఉంటూ పరిపాలన అందిస్తున్నారని, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.

" ప్రజలు కబ్జా రాజకీయాలను తిరస్కరించారు "

ప్రజలను పట్టించుకోకుండా భూ కబ్జాలు, అధికార దుర్వినియోగం చేసిన నాయకులను మళ్లీ ప్రజలు ఆదరించరని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటికే ప్రజలు తమ తీర్పు ఇచ్చారని, బీఆర్ఎస్ భవిష్యత్తు 2023 ఎన్నికల్లోనే తేలిపోయిందని వ్యాఖ్యానించారు.

 రూ.2,147 కోట్లతో అభివృద్ధి పనులు 

వనపర్తి నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యే గా గెలిచినప్పటి నుండి నేటి వరకు  రూ.2,147 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రభుత్వ జీవోలు తీసుకొచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. తాను ప్రజలకు పెద్ద జీతం తీసుకునే ప్రజా ప్రతినిధిలా కాకుండా, బాధ్యతతో పనిచేస్తానని చెప్పానని, అదే విధంగా నిరంతరం ప్రజాసేవలో కొనసాగుతున్నానని అన్నారు.

వనపర్తి రహదారి విస్తరణకు రూ.30 కోట్లు కోరాం 

వనపర్తి పట్టణ రహదారుల విస్తరణకు రూ.30 కోట్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వినతి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని, వనపర్తిని అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు