ప్రధాని మోదీ సభను విజయవంతం చేద్దాం
బీజేపీ నేతల పిలుపు
నాగోల్, మే 9 (విజయక్రాంతి): భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ రాక సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్లో బీజేపీ శ్రేణులు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాయి. బీజేపీ సీనియర్ నాయకులు కాలంశెట్టి హరిబాబు ఆధ్వర్యంలో శనివారం ఇంద్రప్రస్థ కాలనీ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు ప్రధాని నరేంద్ర మోదీ పేరుపై ప్రత్యేక అర్చనలు నిర్వహించగా, అనంతరం స్థానిక నాయకులు మోదీ చిత్రపటానికి దీపాలతో స్వాగతం పలికారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ముందుకు సాగుతోందని, ఆపరేషన్ సింధూర్ వంటి సాహసోపేతమైన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా భాగ్యనగరానికి వస్తున్న మోదీకి భారీ ఎత్తున స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. దేశంకోసం మోదీ మనం అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలతో సభా ప్రాంగణాన్ని మార్మోగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






