19 July, 2026 | 4:02 AM

కాంగ్రెస్‌కు ఇక డెత్ డిక్లరేషనే

19-07-2026 01:36 AM

70 వేల ఉద్యోగాల భర్తీ రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

  1. తెలంగాణ యువతకు రాహుల్ వెన్నుపోటు 
  2. నోటిఫికేషన్లు లేవు.. అన్నీ లూటిఫికేషన్లే 
  3. రేవంత్ జాబులు కాదు రాహుల్ జేబులు నింపుతున్నడు 
  4. అధైర్య పడొద్దు.. తెలంగాణ నిరుద్యోగులకు అన్నగా తోడుంటా 
  5. సరూర్‌నగర్ ‘యువ సంగ్రామ సదస్సు’లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

* రాహుల్ గాంధీ ప్రచారం చేసుకునే ‘మొహబ్బత్ కీ దుకాణ్’ (ప్రేమ దుకాణం) తెలంగాణ యువత పాలిట ‘గద్దారీ కా మకాన్’ (ద్రోహుల ఇల్లు)గా మారింది. రాహుల్ జేబులు నింపే పనిలో బీజీగా ఉన్న రేవంత్, ఇంక జాబులు ఎక్కడి నుంచి ఇస్తారు?

* గతంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సవరించుకుంటాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో యువత ఆలోచనలకు, అవకాశాలకు మరింత ప్రాధాన్యత ఇస్తాం. ఆనాడు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌ను కూడా తమ ప్రభుత్వమే పట్టుకున్నది.

 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి) : కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు సీఎం రేవంత్ రుజువు చేస్తే.. తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశా రు. బీఆర్‌ఎస్ ఇచ్చిన ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని, ఉద్యోగాలపై కాంగ్రెస్ నాయకులు కాకి లెక్కలు చెప్తూ నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ యువతను యూత్ డిక్లరేషన్ పేరు తో దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇక డెత్ డిక్లరేషనే మిగిలిందన్నారు. యూత్ డిక్లరేషన్ ఇచ్చిన వేదికపైనే.. తెలంగాణ యువత కాంగ్రెస్‌కు ‘డెత్ డిక్లరేషన్’ రాస్తుందన్నారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఏ సరూర్ నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘యూత్ డిక్లరేషన్’ బురిడీ పత్రాన్ని ఆవిష్కరించిందని, అదే వేదికపై ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగ యువత కాంగ్రెస్ మోసాలను గ్రహించిందని కేటీఆర్ స్పష్టం చేశారు.

మాట తప్పి, నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే గడ్డపై నుంచి యువత ‘డెత్ డిక్లరేషన్’ (రాజకీయ మరణ శాసనం) రాయడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. మాయమాటలతో యువతను మోసం చేస్తామంటే కుదరదు అని, నిరుద్యోగుల ఉడుకు నెత్తురు, ఉరకలెత్తే ఆశయాల ముందు దగాకోరు రేవంత్ ప్రభుత్వం మోకరిల్లక తప్పదన్నారు. తెలంగాణ యువతను జిత్తులమారి ముసలి నక్కలా కాంగ్రెస్ పార్టీ తెలివిగా చిత్తు చేసిందన్నారు.

శనివారం సరూర్ నగర్ స్టేడి యంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. 60 ఏళ్లు తెలంగాణ నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్.. కొత్త డూప్లికేట్ రూపాల్లో వచ్చి నకిలీ ప్రేమను కురిపించి యువతను బలిపీఠం ఎక్కించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ పెద్ద మోసం అన్న కేటీఆర్, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఓ బురిడీ పత్రాన్ని విడుదల చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, ప్రియాంకలు చేసిన మోసానికి యువత గుణపాఠం చెపుతుందన్నారు. 

అంతా ‘లూటిఫికేషన్’..

రాహుల్ గాంధీ ప్రచారం చేసుకునే ‘మొహబ్బత్ కీ దుకాణ్’ (ప్రేమ దుకాణం) తెలంగాణ యువత పాలిట ‘గద్దారీ కా మకాన్’ (ద్రోహుల ఇల్లు) గా మారిందని విమర్శించారు. రాహుల్‌కు  తెలుగు రాదు కాబట్టి, తెలంగాణ యువత పడుతున్న వేదనను ఆయనకు అర్థమయ్యే భాషలోనే  చెబుతానంటూ హిందీలో మాట్లాడారు. మూడేళ్ల క్రితం అశోక్ నగర్ చౌరస్తాలో ఛాయ్ తాగుతూ నిరుద్యోగులతో దిగిన ఫోటోలు, ఇచ్చిన జూటా హామీలు గుర్తున్నాయా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

దేశమంతా రాజ్యాంగం పట్టుకుని ప్రజాస్వామ్యం గురించి మాయమాటలు చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణలోని నిరుద్యోగుల వీపుల పైన పోలీస్ లాఠీలు మోగుతుంటే, అక్రమ కేసులతో ఆడబిడ్డలను కూడా చూడకుండా అణిచివేస్తుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న అప్రజా స్వామిక అరాచక అణిచివేత చూడకుండా కళ్ళు మూసుకొని ఢిల్లీలో గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా అని నిలదీశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని, తమకు ఇచ్చిన హామీల అమలును ఉద్యోగాల భర్తీ గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో వేధింపులతో అవహేళనతో అణిచివేతకు గురి చేస్తుందని మండిపడ్డారు. 

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన ‘యూత్ డిక్లరేషన్’ హామీల పరిస్థితి ఏమైందని, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇస్తామన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగా లు ఏమయ్యాయి, జాబ్ క్యాలెండర్‌తో పాటు 4,000 నిరుద్యోగ భృతి ఏదని ప్రశ్నించారు. లక్షలాది మంది అభ్యర్థులు కొలువుల కోసం రోడ్లపైకి వస్తుంటే, ఈ ప్రభుత్వం ఉద్యోగాల ‘నోటిఫికేషన్’ ఇవ్వడం పక్కనబెట్టి, కేవలం ‘లూటీఫికేషన్’ (దోపిడీ)లో మునిగిపోయిందని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో ‘ఓటు కొట్టు.. జాబ్ పట్టు’ అని పత్రికల మొద టి పేజీల్లో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చిన కాం గ్రెస్, నేడు ఏడాది దాటినా జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావడం లేదు కానీ, రేవంత్ రెడ్డి బినామీల బీరువాలు నిండుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ జేబులు నింపే పనిలో బీజీగా ఉన్న రేవంత్ రెడ్డి, ఇంక జాబులు ఎక్కడి నుంచి ఇస్తారని ఎద్దేవా చేశారు.

అశోక్ నగర్, దిల్‌షుక్ నగర్ వేదికగా కొలువులు అడుగుతున్న నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి సర్కార్ లాఠీఛార్జీలు, అర్ధరాత్రి అరెస్టులతో దమనకాండ సాగిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగాలు అడిగితే ‘ఎండ్రిన్ తాగి చావండి, బావిలో దూకండి‘ అన్న రేవంత్ అహంకారానికి రాబోయే రోజుల్లో యువత ఘోరి కట్టడం ఖాయమన్నారు.

ఇకపై మరొక లెక్క...

కాంగ్రెస్ చేస్తున్న మోసాలను చూస్తూ కూడా తెలంగాణ మేధావులు మౌనంగా ఉండడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ‘జీనా హై తో మర్నా సీఖో.. కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో‘ అంటూ కొట్లాడిన యువతరం ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే పాలకుల కుర్చీలు కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. విద్యార్థులను కేసుల్లో ఇరికించి వారి భవిష్యత్‌ను దెబ్బతీసే పనులను బీఆర్‌ఎస్ ప్రోత్సహించదని, ప్రజాస్వామ్యయుతంగానే కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగడతామని తెలిపారు.

‘యువతకు ఏ కష్టం వచ్చినా ఒక అన్నగా, సోదరుడిగా నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. 2028లో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు. రాబోయే ప్రభుత్వంలో యువత ఆకాంక్షలకు న్యాయం చేసే బాధ్యత నాది’ అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం యువతను దారుణంగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని కూడా నిరుద్యోగుల తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఎలాంటి దుర్మార్గులకి, మోసకారి నాయకులకి పార్టీకి ఓటు వేసి గెలిపించుకున్నారో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పంటలకు నీళ్లు అడిగితే కోసి నెత్తురు చల్లుకోండి అంటున్నాడు, మరోవైపు బిడ్డలు కొలువులు అడిగితే ఎండ్రిన్ తాగి చాగ తాగండి బాయిలో దూకండి అంటున్నారు, ఇంతటి ఉన్మాదం, అహంకారం తలకెక్కిన దుర్మార్గుడికి ఓట్లు వేసిన విషయాన్ని గుర్తుంచుకొని తగిన సమయంలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

గ్రూప్- ఉద్యోగాల భర్తీ నుంచి మొదలుకొని డీఎస్సీ వరకి అన్ని అంశాల్లో చెప్పిన మాటలు మరిచి నిరుద్యోగులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిని నిలదీస్తే నిరుద్యోగులను పెయిడ్ ఆర్టిస్టులు శంకినీలు అంటూ అడ్డగోలుగా అవమానకరంగా మాట్లాడారని గుర్తు చేశారు. డీఎస్సీ, మెగా డీఎస్సీ వేస్తా అన్న రేవంత్ రెడ్డి, వేసిన డీఎస్సీ కూడా ఇంత అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి అహంకారం, బలుపు మాటలను తెలంగాణ యువత మరిచిపోదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

ఇంతటి నీచమైన మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రిని నిరుద్యోగ యువత ఏమాత్రం క్షమించదని హెచ్చరించారు. యువతకి కాంగ్రెస్ పైన పొట్టు పొట్టు కోపం ఉన్నదని ఓటు పెట్టుకొని మరి కాంగ్రెస్‌కి గోరీ కడతారన్నారు. రేవంత్ రెడ్డి తాను నమ్ముకున్న నియంతా హిట్లర్ కంటే దారుణమైన ముగింపును చూడబోతున్నారన్నారు. 

ప్రజాస్వామికంగా పోరు..

నిరుద్యోగ విద్యార్థుల కష్టాలు, వారు ప్రిపరేషన్ సందర్భంగా పడే బాధలు తనుకు తెలుసు అని, వారి ఆకలి అవస్థలు పట్ల నాకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు, నిరుద్యోగ యువకుల తల్లిదండ్రుల ఆకాంక్షలు కూడా తెలుసు అన్నారు. అందుకే రానున్న రోజుల్లో వారందరికీ ఒక అన్నగా అండగా ఉండి వారి ఆకాంక్షల కోసం వారి అవకాశాల కోసం పోరాటం చేస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

ఒక విద్యార్థిగా అనేక పరీక్షలు రాసి పూణే తో పాటు న్యూయార్క్ యూనివర్సిటీ వరకు సీట్లు సాధించి ఎవరి పైరవీలు లేకుండా ఉద్యోగం సాధించుకున్న తనకు ఉద్యోగ సాధన ఇంత కష్టమైనదో దాని కోసం ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో తెలుసు అన్నారు. కానీ ఎలాంటి ఉద్యోగాల కోసం ఒక్క రోజు కూడా ప్రయత్నం చేయని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్లు అడ్డగోలుగా విద్యార్థుల పైన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు అక్రమాలు చేసినా తాను నేపాల్ మాదిరి ఒక విధ్వంసానికి పిలుపు ఇవ్వడం లేదు అని, కేవలం ప్రజాస్వామికంగా కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతూ వారి పైన పోరాటం చేయాలని మాత్రమే పిలుపునిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. కేవలం విద్యార్థులను కేసుల్లో ఇరికిచ్చి రాజకీయాలు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ ఏనాడు ఆలోచించదు అన్నారు. ఒకవైపు తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూనే భవిష్యత్తును నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీతో పాటు జాబ్ క్యాలెండర్ల వంటి అన్ని అంశాల్లో యువతకు సంబంధించి అన్ని ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని ఒక అన్నగా ముందుకు పోతామని వారి వెంట నిలుస్తానని భరోసా ఇచ్చారు. మరోవైపు టీ స్టార్టప్ అయిన స్కైరూట్ సంస్థ ప్రయోగించిన మొదటి రాకెట్ ప్రయోగానికి సంబంధించిన విజయాన్ని అందరూ అభినందించాలని కోరారు.

ఈ సం దర్భంగా మాట్లాడిన నిరుద్యోగ యువత కాం గ్రెస్ తమకు చేసిన ద్రోహాన్ని వివరించారు. ఇక ఈ సదస్సుకు హాజరైన బీఆర్‌ఎస్ సీనియన్ నేతలు సభాప్రాంగణం చివరలో కూర్చుని కేటీఆర్‌కు కుడి ఎడమలుగా యువతను కూర్చోబెట్టడం పలువురిని ఆకర్షించింది.

తప్పులు సవరించుకుంటాం..

మేము అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో ఉద్యోగాల భర్తీ విషయంలో చాలా సిన్సియర్‌గా పని చేశామన్నారు. 2,32,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించామన్నారు, దీంతో పాటు దాదాపు 27 లక్షల ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.

అయితే టీఎస్పీఎస్సీ వంటి వ్యవహారంలో పేపర్ లీక్ వ్యవహారంలో మరింత వేగంగా స్పందించాల్సి ఉండేదని కేటీఆర్ అన్నారు. గతంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సవరించుకుంటామని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో యువత ఆలోచనలకు, అవకాశాలకు మరింత ప్రాధాన్యత ఇస్తామన్నారు.

ఆనాడు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌లో కూడా తమ ప్రభుత్వమే పట్టుకున్నదని అదేదో పేపర్ లీక్ అయిందంటూ అడ్డగోలుగా దుష్ప్రచారం చేసి ప్రాపగండా చేశారని అన్నారు. 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన తాము ఏనాడు గొప్పలు చెప్పుకోలేదు అన్నారు.

కాంగ్రెస్ మాదిరి కల్లబొల్లి మాటలు, కాకి లెక్కలు చెప్పలేదు అన్నారు. ఏనాడు సభలు పెట్టి సర్టిఫికెట్లు పంచలేదు, మొదటి పేజీలో ప్రకటనలు ఇవ్వకుండా తమ పని తాము చేసుకుంటూ పోయామన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అడ్డగోలుగా అబద్ధాలు అపనిందలతో యువత మనసుల్లో విద్వేషం నింపిందన్నరు.

ఉద్యోగాల భర్తీ అంశంలో కాంగ్రెస్ పార్టీతో చర్చకు తాను సిద్ధం అని కేటీఆర్ సవాలు విసిరారు. యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసం పైన తెలంగాణ సమాజంలోని మేధావులు మౌనంగా ఉండడం పైన కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణ యువతకు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడ్డది ముమ్మాటికి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే, పార్టీనే అని స్పష్టం చేశారు. ఇకపైన కూడా తాను ఒక సోదరుడిగా అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. 

యువతకు ఏ కష్టం వచ్చినా ఒక అన్నగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణలో కేవలం చందాలు దందాలు అనే కల్చర్ నడుస్తుందని, పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు, అందుకే ఐటీ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు పోతున్నాయని కేటీఆర్ అన్నారు. మరోవైపు బీజేపీ తెలంగాణకు వచ్చే పెట్టుబడులను పరిశ్రమలను తన్నుకు పోతున్నదని ఇదేనా జాతీయవాదం అని బీజేపీని ప్రశ్నించారు.