19 July, 2026 | 3:50 AM

స్కైరూట్ విక్రమ్-1 విజయవంతం

19-07-2026 01:13 AM

శ్రీహరికోట నుంచి రోదసిలోకి దూసుకెళ్లిన రాకెట్

దేశీయ పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ఇదే

  1. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర
    1. ప్రయోగం నవతరానికి స్ఫూర్తి: ప్రధాని మోదీ
    2. సంస్థ వ్యవస్థాపకులు, బృందానికి ఫోన్ చేసి ప్రధాని అభినందనలు

శ్రీహరికోట/ రంగారెడ్డి, జూలై18 (విజయక్రాంతి): భారతదేశ అంతరిక్ష రంగ ప్రస్థానం లో సరికొత్త అధ్యాయం మొదలైంది. హైదరాబాద్‌కు చెందిన ‘స్కైరూట్’ ఎరోస్పేస్ అనే ప్రైవేటు సంస్థ రూపొందించిన ‘విక్రమ్ -౧’ ఆర్బిటాల్ రాకెట్ శనివారం ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుం చి రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లింది. దీంతో సంస్థ చేపట్టిన ‘మిషన్ ఆగమన్’ విజయవంతంగా పూర్తయినట్లయింది.

ప్రయోగానికి ముందు అంతరాయాలు తలెత్తినా కాస్త ఆలస్యంగా ప్రయోగం మొదలై నాలుగు దశలను విజయవంతంగా దాటి నిర్ణీత కక్ష్యలోకి చేరింది. ఈ విజయంతో ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ లాంచ్ సామర్థ్యం కలిగిన ‘ఎలైట్’ దేశాల సరసన భారత్ చేరింది. ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇలాంటి ప్రయోగం చేసి సక్సెస్ అయిన ప్రపంచంలోనే మూడో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఏడంతస్థుల ఎత్తు ఉన్న ఈ విక్రమ్ రాకెట్ పూర్తిగా కార్బన్ కాంపోజిట్‌తో నిర్మితమైంది.

దీని బరువు సుమారు 350 కిలోలు. శాస్త్రవేత్తలు రాకెట్‌ను అత్యాధునిక త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో రూపొందించారు. రాకెట్‌లో గ్రాహా స్పేస్, కాస్మోసర్వ్,డీక్యూబ్ సంస్థలకు చెందిన సాంకేతిక పేలోడ్లు సైతం ఉన్నాయి. వీటితో పాటు ప్రధాని మోదీ స్వహస్తాలతో రాసిన ‘వందేమాతరం’ పోస్ట్‌కార్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటితో పాటు స్కైరూట్ ఉద్యోగులు, సిబ్బంది, ఇన్వెస్టర్లు, శాస్త్రవేత్తల దస్తూరితో రాసిన మరికొన్ని కార్డులను కూడా రాకెట్ మోసుకెళ్లింది.

అలాగే, ఇస్రో ప్రస్తుత, మాజీ చైర్మన్లు, భారత వ్యోమగాముల సందేశాలు, వజ్రాలతో చేసిన తామర పువ్వు, బంగారు రాకెట్ నమూనా, సర్ సీవీ రామన్, ఏపీజే అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్ చిత్రాలూ ఉన్నాయి. దేశీయ పరిజ్ఞానంతో మొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ఇదే

2018లో సంస్థ ప్రారంభం

ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్‌కుమార్ చందన, నాగభరత్ డాకా 2018లో ఈ ఏరోస్పేస్ సంస్థను స్థాపించారు. చిన్న ఉపగ్రహాల మార్కెట్‌కు తక్కువ ఖర్చుతో అంతరిక్ష సేవలను అందించాలనే లక్ష్యంతోనే సంస్థ ప్రారంభమైంది. గతంలో 2022లో ఈ సంస్థ ప్రయోగించిన ‘విక్రమ్--ఎస్’, తాజాగా విక్రమ్- -1 విజయంతో వాణిజ్య అంతరిక్ష మార్కెట్‌లో దేశీయ ప్రైవేట్ పరిశ్రమల సత్తాను సంస్థ ప్రపంచానికి చాటిచెప్పింది.

‘మిషన్ ఆగమన్’ పేరిట చేపట్టిన ఈ ప్రయోగం లక్షలాది మంది కలలకు ప్రతిరూపమని సంస్థ అభివర్ణించింది. రాకెట్‌కు సంబంధించిన అత్యంత క్లిష్టమైన ఏవియానిక్స్ సిస్టమ్స్‌ను సైతం హైదరాబాద్ ల్యాబ్‌లో తయారు కావడం విశేషం. అలాగే, రాకెట్ అసెంబ్లింగ్‌తోపాటు కీలక పరీక్షలన్నీ హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోనే జరగడం గమనార్హం.

ఫోన్‌లో ప్రధాని మోదీ అభినందలు

చారిత్రాత్మక విజయం సాధించిన స్కైరూట్ సీఈవో పవన్‌కుమార్ చందన, సహా వ్యవస్థాపకుడు నాగభరత్ డాకాతోపాటు శాస్త్రవేత్తల బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాల్ చేసి అభినందించారు. బృందంలో 25 నుంచి 30 సంవత్సరాల లోపు యువతీయువకులే ఉండటం సంతోషాన్నిచ్చిందన్నా రు.

ఈ విజయం నవతరం ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకమని కొని యాడారు. ప్రయోగ సమయంలో తాను కూడా బృందంతో కలిసి అక్కడే ఉండాలని భావించానని, కానీ, ‘షార్’కు వెళ్లడం కుదరలేదని తెలిపారు. అంతరిక్ష రంగ ప్రయోగాల్లో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యం ఈ ప్రయోగంతో నెరవేరిందని వెల్లడించారు.