19 July, 2026 | 3:51 AM

దిన దిన గండం!

19-07-2026 01:21 AM
  1. థర్మల్ బొగ్గు కొరత
  2. 21.61 లక్షల టన్నులు అవసరం.. ఉన్నది 5.35 లక్షల టన్నులే 
  3. నానాటికీ తగ్గిపోతున్న నిల్వలు
  4. రోజుకు 96.2 వేల టన్నుల బొగ్గు వినియోగం.. వస్తున్నది 71.5 వేల టన్నులే 
  5. క్రిటికల్ జోన్‌లో విద్యుత్ కేంద్రాలు 
  6. పెరుగుతున్న ఒత్తిడి 

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల పరిస్థితి దినదిన గండంలా తయారైంది. తీవ్ర బొగ్గు కొరత కారణంగా ప్లాంట్లలో నిల్వలు అడుగంటుతుండగా.. ఎప్పుడు ఉత్పత్తి నిలిచిపో తుందోనన్న భయం విద్యుత్ వర్గాలను వెంటాడుతోంది. తెలంగాణకు కొంగు బంగారంలా చెప్పుకునే సింగరేణి చెంతనే ఉన్నప్పటికీ.. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత వేధించడం గమనార్హం. పరిస్థితి ఇలాగే కొనసాగితే థర్మల్ విద్యుత్ కేంద్రాలు షట్‌డౌన్ చేయాల్సిన ప్రమాదంలో పడతాయో నన్న ఆందోళన సంస్థ అధికారుల్లో నెలకొంది.   

అందుబాటులో పావంతు నిల్వలే..  

రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో 7,180 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇవి తెలంగాణ అవసరాలకు నిరంతర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. పైగా రాష్ట్ర విద్యుత్ అవసరా ల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఆయా విద్యుత్ కేంద్రాల్లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిబంధనల ప్రకారం 22 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు నిత్యం ఉండాలి. కానీ ప్రస్తుతం అందులో పావు వంతు మా త్రమే నిల్వలు ఉన్నాయి.

22 రోజులకు సరిపోవాలంటే 21.61 లక్షల టన్నుల మేర బొ గ్గు నిల్వలు అందుబాటులో ఉంచాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రా ల్లో ప్రస్తుతం కేవలం 5.359 లక్షల టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. అంటే ఉండాల్సిన బొగ్గు నిల్వలో కేవలం 25 శాతం మా త్రమే ఉన్నాయి. ఈనెల 16వ తేదీ  (గురువారం) నాటి బొగ్గు నిల్వల పరిస్థితిని సెంట్ర ల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వెబ్‌సైట్‌లోనూ పొందుపర్చారు.  

విపత్కర  పరిస్థితుల్లో రెండు కేంద్రాలు..

సీఈఏ నిబంధనల ప్రకారం ప్రతి థర్మల్ విద్యుత్ కేంద్రంలోనూ కనీసం 22 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. దీనిని 100 శాతంగా గణిస్తారు. 20 శాతం కంటే క్రిటికల్ (విపత్కర) జోన్‌లో ఉన్నట్లుగా పరిగణిస్తారు.  దేశ వ్యాప్తంగా 165 థర్మల్ వి ద్యుత్ (దేశీయ బొగ్గుతో నడిచేవి) కేంద్రాలుండగా.. అందులో 20 కేంద్రాలు క్రిటికల్ జోన్‌లో ఉన్నాయి. ఇందులో తెలంగాణలో కొత్తగూడెం (కొత్తది), యాదాద్రి థర్మల్ ప్లాంట్లు ఉన్నట్లు సీఈఏ పేర్కొంది. కొత్తగూడెంలో 20 శాతం, యాదాద్రి థర్మల్ విద్యు త్ కేంద్రంలో 17 శాతం బొగ్గు నిల్వలు ఉన్నా యి. రాష్ట్రంలోని మొత్తం థర్మల్ విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 7,180 మెగావాట్లు కాగా, అందులో క్రిటికల్ జోన్‌లో ఉన్న ప్లాంట్ల సామర్థ్యం 4,200 మెగావాట్లు కావడం గమనార్హం.

అవసరం మేరకు సరఫరా జరగని బొగ్గు

రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజూ 98.2 వేల టన్నుల బొగ్గు వినియోగిస్తారు. కానీ, ఆ స్థాయిలో బొగ్గు సరఫరా కావడం లేదు. గురువారం సరఫరా అయిన బొగ్గు కేవలం 71.5 వేల టన్నులు మాత్రమే. అంటే రోజూ వినియోగించే బొగ్గులో 72.8 శాతం మాత్రమే. ప్రస్తుతం ఉన్న నిల్వలతో వారం రోజులు కూడా పూర్తి స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేని పరిస్థితి తలెత్తవచ్చని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతు న్నాయి. దీంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. భవిష్యత్తులో విద్యుత్ సంక్షోభం ముదిరే అవకాశం ఉందని, సరిపడా బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.