యువ సంద్రంగా సంగ్రామ సదస్సు
- సరూర్‌నగర్ స్టేడియానికి తరలివచ్చిన 40 వేల మంది నిరుద్యోగులు
- గులాబీ రంగుగా మారిన స్టేడియం పరిసరాలు
- కేటీఆర్ ప్రసంగంతో హోరెత్తిన సదస్సు
ఎల్బీనగర్, జూలై 18: నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు యూత్ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సభ ప్రారంభమైంది. యువ సంగ్రామ సభకు సుమారు 40 వేల మంది పైగా హాజరయ్యారు. సభకు ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
సభకు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు సభకు హాజరయ్యారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.
కేటీఆర్ ప్రసంగానికి యువత జేజేలు
కేటీఆర్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు, ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్ల అమలులో జరిగిన జాప్యాన్ని ఎండగట్టారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు, ప్రతి హామీ అమలయ్యే వరకు బీఆర్‌ఎస్ పార్టీ యువత పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
సభకు హాజరైన నిరుద్యోగ యువత, విద్యార్థులు తమ సమస్యలను గళమెత్తి వినిపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సభలో కనిపించిన అపూర్వ జనసందోహం, క్రమశిక్షణ, ఉత్సాహం, ప్రజల పోరాట స్ఫూర్తి కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశాయి. ప్రజల ఆశయాలకు అండగా నిలవాలనే సంకల్పంతో ఈ సభ ముందుకు సాగింది. యువత చూపిన అపూర్వ ఆదరణ, విశ్వాసం తమపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొంటూ, ప్రజా సమస్యల పరిష్కారం, నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు.
సభ హైలెట్స్
* శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది.
* 11 గంటలకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సభను ప్రారంభించి, ప్రారంభోపన్యాసం ఇచ్చారు.
* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం 11:40కి వచ్చారు. 12:22 గం టలకు మాట్లాడి మధ్యాహ్నం 1:24 గంటలకు తన ఉపన్యాసం ముగించారు. సుమారు గంటసేపు సభలో మాట్లాడారు.
* సభా ప్రాంగణం పూర్తిగా గులాబీయమంగా మారింది.
* సరూర్‌నగర్ స్టేడియం ఎదుట ఉన్న విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
* తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత తరలివచ్చారు.
* సుమారు 40 వేల మంది సభకు హాజరయ్యారు.
* దిల్‌సుఖ్‌నగర్, అశోక్ నగర్, చిక్కడపల్లిలోని వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న పోలీస్ ఉద్యోగార్థులు, నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు.
* సభా వేదికపై నిరుద్యోగ యువతకు పెద్దపీట వేశారు.
* ఇప్పటి వరకు ఆందోళనలు నిర్వహించిన యువ నాయకులకు సభలో మాట్లాడే అవకాశం ఇచ్చారు.
* నిరుద్యోగుల జేఏసీ నాయకులు ఇంద్రానాయక్, కుమార్, ఆకాశ్ గౌడ్, శంకర్, శంబు నాయక్, నవీన్, ఉపేందర్, ప్రత్యూష తదితరులు మాట్లాడినప్పుడు స్టేడియం మొత్తం చప్పట్లు, ఈలలతో మార్మోగింది.
ప్రభుత్వం పని అయిపోయింది
5 వేల పోలీసు ఉద్యోగాలని 2 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. రేవంతన్నా.. మన ప్రభుత్వం పని అయిపోయిం ది. రెండేళ్ల తర్వాత మన పరిస్థితి ఏంటనేది ఇప్పుడే డిసైడ్ అయిం ది. పూరీలు, బజ్జీలు చేసుకోవాల్సిందే. మా బాధ ప్రతిఒక్కరికీ అర్థమవుతున్నా రేవంత్‌రెడ్డికి మాత్రం తెలియడం లేదు. పోలీసు ఉద్యోగాలు పెంచడంతో పాటు రానున్న రెండు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.లేకుంటే కొడంగల్‌లో డిపాజిట్ రాకుం డా చేస్తాం. ఉమ్మడి పాలమూరులో ఒక్క సీటు కూడా రానివ్వం బిడ్డా.
నవీన్‌గౌడ్, మహబూబ్‌నగర్
తొడగొట్టి చెప్తున్నా.. మిమ్మల్ని విడిచిపెట్టం
మాకు మాటిచ్చిన రాహుల్‌గాంధీ ఇప్పుడు సరూర్‌నగర్ రాగలరా. ప్రియాంకాగాంధీ ఇక్కడే మాట్లాడుతూ ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ఏమైనయ్ ఆ ఉద్యోగాలు. ఒకాయన ఎన్రిన్ తాగండి, బావిలో దూకి సావండి.. కానీ ఉద్యోగాలు పెంచునంటుండు. పెంచవా బిడ్డా.. 2 లక్షల ఉద్యోగాలు నీ గల్లా పట్టి వసూల్ చేసుకుంటాం. ఉద్యోగాల జాతర అన్నారు.. ఇప్పుడు సరూర్‌నగర్‌లో నిరుద్యోగుల జాతర నడుస్తోంది. మూడోసారి కూడా కురుమూర్తి జాతర అయిపోయింది. కానీ, ఉద్యోగాల జాత ర మాత్రం కాలేదు.
ఎండ్రిన్ తాగాలంటున్నావ్.. అది రైతులకే దిక్కులేదు, మాకు ఎక్కడ నుంచి వస్తుంది. ఊరూరు తిరిగి అమ్మలక్కల కాళ్లు మొక్కి మిమ్మల్ని గెలిపించిన పాపానికి మొదటి ఎండ్రిన్ తాగాల్సింది రేవంత్‌రెడ్డే. తర్వాత రాహుల్, ప్రియాంకా తాగాలి. నాకు ఎండ్రిన్ డబ్బా దొరికితే సక్కగా రేవంత్‌రెడ్డికే పోస్తా. మెగా డీఎస్సీ వస్తే నేను టీచర్ అయి వెళ్లిపోతా అంటే.. వినకుండా నన్ను లీడర్‌ను చేశారు. రాహుల్‌గాంధీ మళ్లొకసారి వచ్చి ఎన్ని ఉద్యోగాలిచ్చారో చర్చ జరపాలి. వారం రోజుల్లో సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామన్న అద్దంకి దయాకర్ పత్తా లేడు. రేవంత్‌రెడ్డి తొడగొట్టి చెప్తున్నా.. మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. విద్యాశాఖను తీసుకొని తప్పు చేశావు. నీలాంటి దొంగను సీఎంను చేయడమే మా తప్పు.
ఆస్మా, నిరుద్యోగుల సంఘం నాయకురాలు
రేవంత్.. దిల్‌సుఖ్‌నగర్ రా..
15వేల పోలీసులు కొలువులకు ప్రకటన వస్తుందన్న ఆశతో.. ఒక నిరుపేద రైతు తన భార్య పుస్తెల తాడు కుదువ పెట్టి విత్తనాల కోసం దాచిన డబ్బును కుమారుడికిచ్చి హైదరాబాద్ పంపిండు. ఇప్పుడు 5 వేల పోస్టులే ఇస్తే ఆ నిరుద్యోగి, రైతు ఆవేదన ఎలా ఉంటుందో తెలుసా రేవంత్. వారికి ఎవరు సమాధానం చెప్తారు. 5 వేల పోస్టులను 15 రకాల కోటాలకు ఎలా పంచుతావు. ఆ ధైర్యం లేకనే నోటిఫికేషన్ జాప్యం చేశావు. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 48 స్థానాలిస్తే..
తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు జీవో 46 రద్దు చేయకుండా నిరుద్యోగులను ఆగం చేస్తున్న వు. దిల్‌సుఖ్‌నగర్ వస్తే మా కష్టాలు తెలుస్తాయి. హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర, బోర్డు డీజీపీ దగ్గర పెట్టుకుంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు ఎవరి దగ్గరికి పోవాలి. ఓట్ల కోసం మా దగ్గరకు వస్తావ్ కదా.. నీకు ఘోరి కట్టే రోజు దగ్గరలోనే ఉంది. కేసీఆర్ 47 వేల పోలీసు ఉద్యోగాలిచ్చారు, నువ్వు ఎన్నిచ్చినవ్ చెప్పాలి. నిరుద్యోగులతో పెట్టుకున్న ఎవ్వరూ చరిత్రలో మిగల్లేదు.
ఆకాష్, నిరుద్యోగి
రేవంత్‌కు ఘోరీ కడుతాం
యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగుల భవిష్యత్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం డెత్ డిక్లరేషన్ రాసింది. 70వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతుంది. సరూర్‌నగర్ సభకు వచ్చిన నిరుద్యోగులను చూసిన తర్వాత అయినా కళ్లు తెరవాలి. నిరుద్యోగులంతా ఏకమై రేవంత్‌రాజకీయ భవిష్యత్‌కు ఘోరి కడతాం.
ఉద్యోగాల కోసం కొట్లాడు తుంటే అక్రమ అరెస్టులు చేయించి, ఆన్‌లైన్ ట్రోల్ చేశారు. ఆడపిల్లలం అని చూడకుండా పోలీసులు మమ్మల్ని ఈడ్చుకెళ్లారు. ఇక సహించం. హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకున్న రేవంత్.. ఎమర్జెన్సీ సమయంలో ఇందిను అడ్డుకున్నది యువతేనని గుర్తు చేసుకోవాలి.
సింధురెడ్డి, నిరుద్యోగి
కాంగ్రెస్‌ను రానీయం
ఎన్నికల సమయంలో నిరుద్యోగులను ఉసిగొల్పిన కోదండరాం ఎక్కడ పోయిండు. 18 మంది నిరుద్యోగులు చనిపోతే మాట్లాడారా. మీ మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవి కోసమే మాట్లాడుకుంటున్నా -రు. కేసీఆర్, కేటీఆర్ సీట్లు ఊడగొడితే మాకు ఉద్యో గాలు ఇస్తాం అన్నవ్. అసలు ఊడగొట్టాల్సిందే మిమ్మల్ని.
సాయిబాబా గుడి మీద ఆన వేసి చెప్తున్నా.. కాంగ్రెస్ పార్టీని మళ్లీ రాని య్యం. కాంగ్రెస్ పార్టీ దుకాణం ఇక బంద్. మమ్మల్ని వాడుకుని అధికారంలోకి వచ్చి మా గురించి ఆలోచించకుండా.. భూములు ఎక్కడ ఉన్నాయి, ఎలా దోచుకోవాలని ఆలోచిస్తున్నారు. మేం గాంధీభవన్ మెట్లు ఎక్కినప్పుడు అక్కడ పల్లి, బఠానీలు అమ్ముకునే వాడు కూడా లేడు. నిరుద్యోగుల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేడు గాంధీభవన్ కళకళలాడుతుంది.
ఇంద్రానాయక్, నిరుద్యోగి, అమీర్‌పేట
ఓయూ నుంచి మరో ఉద్యమం
2 లక్షల ఉద్యోగాలిస్తామంటే చెప్పులు అరిగేలా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేశాం. ఇప్పుడు నిరుద్యోగులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతుంది. వెనుకబడిన పాలమూరు జిల్లా నుంచి వచ్చినవ్.. నిరుద్యోగుల సమస్యలు అర్థం చేసుకుంటావని అనుకున్నం. ఉద్యోగాలు అడిగితే టెర్రరిస్టుల్లా కనబడుతున్నామా. ఎండ్రిన్ పోసి చంపేందుకే నిన్ను సీఎం కుర్చీలో కూర్చొబెట్టినమా. 20 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ ప్రకటించకుంటే నిన్ను బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మరో ఉద్యమం బయలుదేరుతుంది.
అనితా ముదిరాజ్, ఉస్మానియా యూనివర్సిటీ
పాతాళానికి తొక్కుతాం
అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి యూత్ డిక్లరేషన్ పేరిట హామీ ఇచ్చారు. ఇప్పుడు నిరుద్యో గులు హామీల గురించి అడిగితే బావిలో దూకి చావండి, ఎండ్రిన్ తాగి చావండి అంటారా. నిరుద్యోగులు కొలువుల అడిగితే నువ్వు కన్నీరు ఇచ్చావు, నోటిఫికేషన్ అడిగితే పోలీస్ స్టేషన్ చూపిస్తున్నావ్, మమ్మల్ని బలి పశువులను చేస్తున్నావు సీఎం రేవంత్. దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు పోలీసుల లాఠీ ఛార్జ్ తో రక్తాన్ని చిందిస్తున్నారు.
కాంగ్రెస్ చావుబతుకుల మధ్య ఉంటే మా నిరుద్యోగులు ఆక్సీజన్ ఇచ్చి రక్షిస్తే.. ఈ రోజు గద్దెనెక్కి మాకు నరకం చూపిస్తున్నావ్. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోఫికేషన్‌ను నీ ఖాతాలో వేసుకున్నావ్. గీతమ్మ రేవంత్‌రెడ్డికి ఒకరోజు అన్నం పెట్టకపోతే నిరుద్యోగుల బాధ తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 117 సీట్లు కాదు.. కేవలం 9 సీట్లే ఇవ్వకపోతే మేం నిరుద్యోగులే కాదు. సైనికుల్లా కదిలి పాతాళానికి తొక్కుతాం.
సెంట్రల్ లైబ్రరీ నుంచి రవికుమార్






