ఘనంగా అత్తాపూర్ జగన్నాథ రథయాత్ర
- ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహణ
- భారీగా హాజరై రథాన్ని లాగిన భక్తులు
- ఆధ్యాత్మిక ఉత్సాహంతో ముగింపు
రాజేంద్రనగర్, జూలై 18 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ పరిధిలోని అత్తా పూర్‌లో శ్రీ జగన్నాథ రథయాత్ర శనివారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహంతో ముగిసింది. అత్తాపూర్ ఇస్కాన్ జగన్నాథ మందిరం ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ రథయాత్రలో వేలా ది మంది భక్తులు పాల్గొని, అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారి రథాన్ని లాగారు. శనివారం మధ్యాహ్నం ఇస్కాన్ ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించిన అనంతరం రథయా త్రను ప్రారంభించారు.
రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన భారీ రథంపై స్వామివార్లు భక్తులకు దర్శనమిచ్చారు. అత్తాపూర్ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ యాత్రలో భక్తుల హరినామ సంకీర్తనలు, మృదంగ వాయిద్యాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రథయాత్ర సాగిన మార్గమధ్యంలో స్థానిక ప్రజలు, వ్యాపారులు స్వామివార్లకు ఘనస్వాగతం పలికారు. ఇళ్ల ముందు ముగ్గులు వేసి, కర్పూర హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. రథయాత్ర ముగింపు వేదిక వద్ద స్వామివారికి ప్రతిష్ఠాత్మకమైన ‘56 భోగ్’ (56 రకాల నైవేద్యాలు) సమర్పించారు. అనంతరం భక్తులందరికీ భారీగా మహాప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథయాత్రను విజయవంతం చేశారు.






