అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు
ఆలేరు,(విజయక్రాంతి): న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు ఎ. జయరాజు సూచనల మేరకు సంస్థ కార్యదర్శి వి. మాధవి లత ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని భువనగిరిలోని జాగృతి కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత విద్యార్థినులకు జూవెనైల్ జస్టిస్ చట్టం, రాజ్యాంగ ప్రాథమిక హక్కులు–విధులు, జాగృతి న్యాయ సేవల పథకం, సైబర్ నేరాలపై అప్రమత్తత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
న్యాయ సహాయ న్యాయవాది ఎస్. సాయి శ్రీనివాస్ పోక్సో చట్టం, ఉచిత న్యాయ సహాయం, న్యాయ సేవల అధికార సంస్థ చట్టం తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్. మల్లేష్ మాట్లాడుతూ, నేటి యువత అన్ని రంగాల్లో చైతన్యవంతంగా ఎదగాలని అన్నారు. యువత శక్తి, విజ్ఞానం దేశ ప్రగతికి సోపానాలని పేర్కొన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల వ్యాపారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటి కారణంగా భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థినులు, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.






