17 August, 2026 | 3:06 AM

సారథుల నియామకంలో అలసత్వం

17-08-2026 12:00 AM

మండల అధ్యక్ష ఎంపికపై ఆ రెండు పార్టీలు మల్లగుల్లాలు 

ఆశల పల్లకిలో ఆశావహులు

చిన్నంబావి, ఆగస్టు 16: నియోజకవర్గంలోని చిన్నంబావి మండలంలో రెండు ప్రధాన పార్టీల తీరు ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తోంది.ఆ పార్టీలు మండలంలో ఆయా పార్టీలను బలోపేతం దిశగా అడుగులు వేయడంలో వెనుకబాటు స్పష్టమౌతుంది. మండల పార్టీల అధ్యక్షుల ఎంపిక విషయంలో అటు కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ పార్టీలు తీవ్ర మల్లాగుల్లాలకు  గురవుతున్నాయి.వాటి పర్యవసానం పార్టీ అంతర్గత విభేదాలకు దారితీస్తోంది.

ఆ రెండు పార్టీల అధిష్టానాలు స్థానిక సమీకరణాలను సమన్వయం చేయలేక తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. అటు బిఆర్‌ఎస్ పార్టీలో మండల అధ్యక్షుడు లేక మూడు సంవత్సరాలు గడుస్తున్న సరైన  నాయకుని మండల స్థాయిలో నియమించలేదు.

ఇటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి నియామకంలో ఇంకా  తర్జనభర్జన  సాగుతోంది.మండలంలో ఏ కులం ఓటర్లు ఎక్కువగా ఉంటే, ఆ కులానికి చెందిన వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఒత్తిళ్లు రెండు పార్టీల్లో బలంగానే  ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది, ఆయా పార్టీలు మాత్రం మండల అధ్యక్షుడు ఒక సామాజిక వర్గానికి చెందిన వారైతే, ఉపాధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి పదవులను వేరే సామాజిక వర్గాలకు (బీసీ, ఎస్సీ, ఎస్టీ లేదా మైనారిటీలకు) కేటాయించే విధంగా  ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డాయి.

ఈ నేపథ్యంలో రెండు పార్టీల అధినాయకత్వాలు మండల అధ్యక్షుల ఎంపికకు హ్యూహాలు చేస్తూనే, ఆశావహులకు ప్రత్యామ్నాయంగా కమిటీలలో వైస్ ప్రెసిడెంట్లుగా, జనరల్ సెక్రటరీలుగా లేదా జిల్లా కమిటీలలో చోటు కల్పిస్తామని హామీ ఇస్తూ సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాట్లు సమాచారం. మరో వైపు బీస్పీ, బీజేపీ, పార్టీలు  నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై స్పందించడం, ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేస్తూ, తమ పార్టీల సిద్ధాంతాలను ప్రజలోకి తీసుకువెళ్ళే ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తున్నాయి.