జిల్లా పరిషత్ పాఠశాలకు బీరువాలు, కార్పెట్లు అందజేసిన సర్పంచ్
- సొంత ఖర్చుతో మూడు బీరువాలు, ఆరు కార్పెట్లు
- అందించిన పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్
- పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా: సర్పంచ్
మునుగోడు,(విజయక్రాంతి): చదువుకున్న పాఠశాలపై ప్రేమతో పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తూ మునుగోడు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ జిల్లా పరిషత్ పాఠశాలకు మూడు బీరువాలు, ఆరు కార్పెట్లు సొంత ఖర్చుతో అందజేశారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్, విద్యార్థుల సౌకర్యార్థం ఈ సామగ్రిని పాఠశాలకు అందించారు.
విద్యార్థులు స్టడీ అవర్ సమయంలో మైదానంలో కూర్చొని చదువుకోవడానికి కార్పెట్లు ఉపయోగపడతాయని తెలిపారు.అడగకముందే పాఠశాలపై ఉన్న ప్రేమతో బీరువాలు, కార్పెట్లు అందజేయడం పట్ల పాఠశాల సిబ్బంది సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు పాఠశాల అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు.
ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినిలతో కలిసి సర్పంచ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల తరఫున సర్పంచ్ దంపతులను ఘనంగా సన్మానించారు. మహిళా టీచర్లు, సిబ్బందిని సర్పంచ్ శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల ప్రసాద్, ఉపాధ్యాయులు కే. సత్తిరెడ్డి, రత్నయ్య, అన్నపురెడ్డి, వెంకటేశ్వర్లు, బాబురావు, రాజేశ్వర్ తదితర ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.




