27 February, 2026 | 6:21 PM

నకిలీ పత్రాలతో భూ కబ్జా

27-02-2026 03:13 PM

కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదు.. ఇద్దరి అరెస్ట్

కొత్తపల్లి,(విజయక్రాంతి): నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా భూమిని విక్రయించిన కేసు కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఎలగందల్ సయీద్‌తో పాటు సాక్షిగా సహకరించిన అబ్దుస్ సమీని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే భూకబ్జా ఉదంతంలో కాంగ్రెస్ నాయకుడు జక్కుల మల్లేశంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం... రేకుర్తి పరిధిలోని సర్వే నెంబర్ 49లో గోవర్ధన్ అనే వ్యక్తికి చెందిన 343 గజాల స్థలం ఉంది.

బాధితుడు ఈ భూమిని 2002లో కొనుగోలు చేశారు. అయితే, ఈ భూమిపై కన్నేసిన ఎలగందల కు చెందిన సయీద్, రేకుర్తి గ్రామ పంచాయతీ నుండి అనుమతులు పొందినట్లుగా నకిలీ పత్రాలను సృష్టించారు. ఆ పత్రాల ఆధారంగా భూమిని కబ్జా చేయడమే కాకుండా, దానిని ఇతరులకు విక్రయించి నగదు వసూలు చేశారు.​ ఈ అక్రమ విక్రయానికి సంబంధించి నకిలీ పత్రాలపై సాక్షి సంతకం పెట్టిన అబ్దుస్ సమీ పాత్రను కూడా పోలీసులు గుర్తించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, ఈ దందాతో సంబంధం ఉన్న కాంగ్రెస్ నాయకుడు జక్కుల మల్లేశంతో కలిపి 10 మందిపై కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, గౌరవ న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. భూకబ్జాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.