వ్యాధుల పట్ల చికిత్స కంటే నివారణే ముఖ్యం
దోమల నివారణ అవగాహనపై ఇంటింటి కార్యక్రమం
కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత
జవహర్ నగర్,(విజయక్రాంతి): వ్యాధుల పట్ల చికిత్స కంటే నివారణే ముఖ్యమని దోమల నివారణ కై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఇంటి ఆవరణ పరిశుభ్రత దోమల నివారణకు ఉత్తమమైన మార్గమని కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం దోమల నివారణ పై అవగాహన ఇంటింటికి కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత హాజరై మాట్లాడుతూ మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి మన ప్రాంతాల్లో ఉన్న దోమలను అరికట్టవచ్చునని ఇంటి ఆవరణ పరిశుభ్రత దోమల నివారణకు ఉత్తమ మార్గం అన్నారు. దోమల వల్ల మలేరియా డెంగ్యూ వ్యాధులను వ్యాప్తి చేసే రకాలు ఉన్నాయని మొదట మన ఇల్లు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే దోమలను నివారించవచ్చుననీ తెలిపారు.
ఒక దోమ తన జీవితకాలం 30 రోజులలో సుమారు వెయ్యి గుడ్ల చొప్పున పెట్టి సంవత్సరానికి సుమారు 700 కోట్ల దోమలను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. వారానికి ఒకసారి నీటి నిల్వలను తొలగించి దోమలను వాటి లార్వాలను నిర్మూలించాలని తెలిపారు. మన పరిసరాలను మన చుట్టుపక్కన ఉన్నటువంటి ఆవరణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితేనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు. దోమల నివారణకు పరిసర ప్రాంతాలను సాధ్యమైనంతవరకు పరిశుభ్రంగా ఉంచుతూ మురుగునీటిని నిల్వ హించకుండా ప్రత్యేక రసాయనాలతో పిచికారి చేసి దోమలను నివారించాలన్నారు.
దోమల నివారణకు దోమతెరలు వంటి సాధనాలు ఉపయోగించి దోమల వ్యాప్తిని అరికట్టవచ్చునని కీసర మున్సిపల్ పరిధిలో శుభ్రత పరిశుభ్రత నియమాలు పాటించి ప్రజలు స్వచ్ఛంద అవగాహనతో ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతంగా సాగుతుందన్నారు. అనంతరం కీసర సర్కిల్ చంద్రపురి డివిజన్లోని చెన్నాపురం విలేజ్ చెన్నాపురం చెరువులో దోమల నిర్మూలన మందులు పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈలు భాస్కర్, తిరుపతి, రాజు, శ్రీనివాస్, స్వామి ఎంటమాలజి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






