పీఎం కిసాన్‌కు 3.15 లక్షల కోట్లు
‘ఖేలో ఇండియా’కు 36,441 కోట్ల కేటాయింపు
కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ, జూలై 31: వ్యవసాయరంగానికి కేంద్రం పెద్దపీట వేస్తూ పీఎం కిసాన్ పథకానికి రూ.3.15 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని నిర్ణయించింది. తద్వారా పథకం ౨౦౩౦ ౩౧ ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగనున్నది. ఈ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది.
ఈ భేటీలో క్యాబినెట్ అనేక నిర్ణయాలు తీసుకున్నది. వ్యవసాయ రంగంతోపాటు క్రీడలకూ కేంద్రం ప్రాధాన్య మిచ్చింది. ‘ఖేలో ఇండియా’ రూ.36,441 కోట్ల నిధుల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. నిధుల ద్వారా జాతీయస్థాయి క్రీడా సమాఖ్యలకు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030 31 వరకు ఆర్థికసాయం అందుతుంది. సమాఖ్యలు నిధులను వినియోగించి క్రీడాకారులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నాయి. వారి విదేశీ పర్యటనలకు ఆర్థిక సాయం అందించనున్నాయి.
దేశీ ఇంధన స్వయం సమృద్ధి సాధనే లక్ష్యంగా ‘సముద్ర మంథన్’ అనే జాతీయ ఆఫ్ ష్యూర్ అన్వేషణ పథకానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అన్వేషణకు రూ.84,084 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. నిధుల ద్వారా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ సముద్ర గర్భంలోని చమురు, గ్యాస్ నిల్వలను వెలికితీయనుంది. దేశంలో సౌర విద్యుత్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ‘ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన’ ప్రారంభించింది. ఈ పథకానికి కేంద్రం రూ.5,070 కోట్ల బడ్జెట్ కేటాయించగా, క్యాబినెట్ ఆమోదించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పథకం ప్రారంభం కానున్నది.






