నన్ను అరెస్టు చేస్తే.. ఇక అంతే సంగతులు!
ప్రత్యేక దళాలను దించుతా
ఇజ్రాయెల్ ప్రధాని వార్నింగ్
జెరూసలెం, జూలై 31: తనను అరెస్ట్ చేస్తే ప్రత్యేక దళాలు రంగంలోకి దిగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దానీ ఇటీవల నెతన్యాహు అరెస్ట్ గురించి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నెతన్యాహు శుక్రవారం స్పందించారు. త్వరలో నెతన్యాహు అమెరికాలో పర్యటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హాజరవుతానని నెతన్యాహు స్పష్టం చేశారు.
మమ్దానీ అనవసర రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. యూదులలో విద్వేశాన్ని నింపడం తగదన్నారు. ఐసీసీ అవినీతిమయమైన సంస్థ అని, తనపై నకిలీ వారెంట్‌ను జారీ చేసిందని కొట్టిపడేశారు. కాగా మమ్దానీ నెతన్యాహును అరెస్టు చేయాలని ట్రంప్‌ను కోరగా తాము అరెస్టు చేయబోమని కుండబద్ధలు కొట్టారు. గాజాపై యుద్ధం కారణంగా ఐసీసీ నెతన్యాహుపై 2024లో యుద్ధ నేరస్థునిగా పరిగణిస్తూ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ ప్రకారం ఐసీసీ సభ్యదేశాల్లోకి అడుగుపెడితే నెతన్యాహును అరెస్టు చేసే అవకాశం, ముప్పు పొంచి ఉంది.






