calender_icon.png 4 February, 2026 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులను పరిరక్షించి అభివృద్ధి చేయాలి

04-02-2026 08:11:24 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): జిల్లాలో చిత్తడి నేలలుగా గుర్తించిన చెరువులను పరిరక్షించి అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు, కాగజ్‌నగర్ డివిజన్ అటవీ అధికారి అప్పయ్య, శిక్షణ ఐఎఫ్‌ఎస్ అధికారి భార్గవ్ కుమార్ తదితరులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెంచికల్‌పేట మండలంలోని ఎల్లూరు చెరువును ఇప్పటికే చిత్తడి నేలగా గుర్తించామని, దీని ద్వారా ఆక్రమణలను అరికట్టవచ్చని తెలిపారు. చెరువుల అభివృద్ధితో సాగునీరు అందుబాటులోకి రావడంతో పాటు పశువులకు తాగునీరు, పక్షుల వలసల ద్వారా పర్యాటక అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. అలాగే తిర్యాణి మండలంలోని చెలిమెల ప్రాజెక్టును కూడా చిత్తడి నేలగా గుర్తించి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

అనంతరం జిల్లా కేంద్రంలోని ఈవిఎం గోదామును నెలవారీ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. ఈవిఎంల భద్రతకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతుందని, అన్ని కెమెరాలు ఎల్లవేళలా పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్యాన్సర్ వ్యాధి నివారణకు వైద్య, మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 128 క్యాన్సర్ కేసులు ఉన్నాయని వెల్లడించారు.

 సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ప్రతిజ్ఞ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది రెండో రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ నిర్వహించారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి 20 వార్డులకు 41 మంది పోలింగ్ అధికారులు, 39 మంది సహాయ పోలింగ్ అధికారులు, 80 మంది ఇతర సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు.

కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి 30 వార్డులకు 106 మంది పోలింగ్ అధికారులు, 112 మంది సహాయ పోలింగ్ అధికారులు, 209 మంది ఇతర సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఈ నెల 11న జరగనున్న పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, నీటిపారుదల శాఖ అధికారులు, ఎన్నికల విభాగ సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.