2 April, 2026 | 2:24 AM

వరదలొస్తేనే మేల్కొంటారా?

02-04-2026 12:37 AM

కబ్జా కోరల్లో చెరువులు

నాళాలు కూడా అదే తీరు

రైల్వే శాఖకు నష్టమే 

బఫర్ జోన్, ఎఫ్ టీ ఎల్ నిర్ధారణ ఎప్పుడు? 

మహబూబాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): మరో మూడు నెలలే.. వర్షాకాలా నికి గడువు ఉంది. అప్పట్లోగా ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, నాళాల పరిరక్షణకు పోనుకోకపోతే గత ఏడాది వర్షాకా లంలో పడ్డ తిప్పలు మళ్ళీ పడాల్సిన పరిస్థితి ఎదురవక తప్పదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వందలాది చెరువులు, కుంటలు, నాళాలు కబ్జా కోరల్లో చిక్కిపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు వేలకు పైగా చెరువులు, కుంటలు ఉండగా అందు లో వెయ్యికి పైగా చెరువులు, కుంటలు అధిక విస్తీర్ణంలో కబ్జాలకు గురైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.

పట్టణాల్లో ఉన్న చెరువులను ఆక్రమించిన కొందరు అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టడం, గ్రామస్థాయిలో ఉన్న చెరువులు, కుంటలు ఆక్రమించిన వారు అందులో వ్యవసాయం చేయడం వల్ల చెరువులు, కుంటలు నీటి నిలువ సామర్థ్యం తగ్గిపోయి రోజు రోజుకు కుంచించుచకుపోతున్నానే విమర్శలు వస్తున్నాయి. అలాగే వరద (నాళాలు) కాలువలను ఆక్రమించడం వల్ల వర్షం నీరు కుంటలు, చెరువుల్లోకి చేరే పరిస్థితి లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన చెరువులుగా గుర్తించిన వాటిని సైతం ఆక్రమిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

చెరువులు, కుంటల బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్ టి ఎల్) పరిధిలను దాటేసి కూడా కొందరు చెరువుల్లోకి చొరబడి చెరువులను చెరబడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంలోని వివిధ శాఖల పరిధిలో ఉన్న చెరువులు, కుంటలకు నిర్ణీత దూరంలో బఫర్ జోన్, ఎఫ్ టీ ఎల్ ఉండాల్సి ఉండగా, ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదనే విమర్శలు వస్తున్నాయి. కుంటలు, చెరువుల ఆక్రమణ రోజురోజుకు పెరిగిపోయి పట్టణాలు, పల్లెలో వర్షాకాలం వరదల ముంపు తీవ్రత పెరగడానికి కారణంగా మారిందని ఆరోపిస్తున్నారు.

గత ఏడాది అక్టోబర్ లో కురిసిన భారీ వర్షాలకు త్రీ నగరి గా పేరుగాంచిన వరంగల్ రోడ్లన్నీ నదులుగా మారడం, ఎక్కడి నీరు అక్కడే తిష్ట వేసి అనేక కాలనీలు రోజుల తరబడి జలదిగ్బంధంలో చిక్కుకొని భారీగా ఆస్తులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైళ్ల రాకపోకల తో పాటు, రోడ్డు రవాణా కూడా పూర్తిగా స్తంభించిపోయింది. అయినప్పటికీ ఇప్పటివరకు అధికార వర్గాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోకపోవడం, దీనికి తోడు ఆక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించడం, ఆక్రమించిన చెరువులు, కుంటలు, నాళాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీ సౌకర్యం కల్పించడం విమర్శలకు తావిస్తోంది.

దీనివల్ల చెరువులు, కుంటలు, నాళాల విస్తీర్ణం రోజురోజుకు కూచించుకుపోయి, భవిష్యత్తులో చెరువులు, కుంటలు, నాళాలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడనుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటలు ఆక్రమించడం వల్ల వర్షాకాలంలో వరద నీరు చెరువుల్లోకి వెళ్లకుండా, దిగువకు వెళ్ళిపోయి భూగర్భ నీటిమట్టం స్థాయి తగ్గుతుందనే విమర్శలు వస్తున్నాయి.

జిల్లాలో హైడ్రా తరహా సంస్థ ఏర్పాటు చేయాలి

హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు, నాళాల ఆక్రమణలను తొలగించడానికి ‘హైడ్రా’ ఏర్పాటుచేసిన విధంగా ప్రతి జిల్లాలో కూడా చెరువులు, కుంటలు, నాళా లు, ఇతర అక్రమ నిర్మాణాలను కట్టడి చేయడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించిన వారిని తొలగించాలని, భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణ లు జరగకుండా పటిష్టమైన కార్యాచరణ చేపట్టి చెరువులు, కుంటలు, నాళాల రక్షణకు ప్రభుత్వం కృషి చేయాలి.

రైల్వే శాఖకు నష్టమే

చెరువులు, కుంటలు, నాళాల ఆక్రమణ వల్ల రైల్వే శాఖకు కూడా భారీగా నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైల్వే ట్రాక్ వెంట ఉన్న చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించడం వల్ల భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద ఉప్పొంగి ప్రవహించడం వల్ల ఎక్కడైనా చెరువు తెగితే రైల్వే ట్రాక్ పూ ర్తిగా నీట మునిగి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అక్టోబర్ 2025లో కురిసిన భారీ వర్షాలకు కాజీపేట నుండి డోర్నకల్ సెక్షన్లో కొన్ని కుంటలు తెగిపోవడంతో భారీ వరద రైల్వే ట్రాక్ ను ముం చెత్తింది.

దీనితో ఒకరోజు పూర్తిగా దక్షిణాది నుండి ఉత్తరాదికి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే స్టేషన్లన్నీ కూడా చెరువులను తలపించాయి. అలాగే వర్షాకాలంలో కురిసిన భారీ వర్షానికి కేసముద్రం ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీనితో మూడు రోజులపాటు రైళ్ల రాకపోకలు స్తంభించాయి. రైల్వే శాఖ ‘ట్రాక్ ఎఫెక్టెడ్ ట్యాంక్స్’ ను గుర్తించి వాటి నుండి వరద ముప్పు నివారణకు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వెంటనే హద్దులు నిర్ణయించాలి

ఇరిగేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు స్పందించి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న చెరువులు, కుంటలకు, నాళా ల ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ సర్వే నిర్వహించి , హద్దులు నిర్ణయించి ఎఫ్ టీ ఎల్ పరిధిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించి, చెరువులు, కుంటలు, నాళాలను పరిరక్షించే కార్య క్రమాలను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. చెరువులు, కుంటలు, నాళాలు ఆక్ర మణకు గురైతే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమణలకు గురికాకుండా నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.