13-02-2026 01:01:27 AM
కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మె
కలెక్టరేట్ ఎదుట కార్మిక, ప్రజా సంఘాల నిరసన
ఆదిలాబాద్/కుమ్రం భీం ఆసిఫాబాద్/కాగజ్నగర్/తిర్యాణి/వాంకిడి/నిర్మల్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో ఆయా కార్మిక సంఘాలు నిరసనలతో హోరెత్తించారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐ.ఎన్.టీ.యూ.సీ, ఏ.ఐ.కే.ఎస్ ఇలా ఈనెల కార్మిక సంఘాలు వివిధ రంగాల్లోని కార్మికులతో కలిసి నిరసనలు వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగానే జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం నిరసన తెలిపారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్యాలయం ప్రధాన గెట్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, పెద్దపెట్టిన నినాదాలతో హోరెత్తించారు. ఈ మేరకు కార్మిక, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.... కేంద్రం లోని ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్స్ గా నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.
ఆ 4 లేబర్ కోడ్స్ ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతూ నవంబర్ 21 న గెజిట్ విడుదల చేసిందని మండిపడ్డారు. ఈ గెజిట్ ను, లేబర్ కోడ్ లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి వీబి జీ-రామ్ జీ స్కీమ్ ను తెచ్చి రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపిందనీ మండిపడ్డారు. విద్యుత్ సవరణ బిల్లు-2025, విత్తన సవరణ చట్టం, ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ పెట్టుబడు లకు అనుమతి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కొరకు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ లాంటి మరిన్ని వినాశకరమైన చట్టాలను బిల్లులను తీసుకొచ్చి ప్రజలపై దాడి చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం నాలుగు 4 లేబర్ కోడ్ల అమలుతో 40 కోట్ల సంఘటిత, అసంఘటిత కార్మికులు వారి కుటుంబాలు చితికిపొయ్యేలా, కార్పొరేట్లు లాభాలు పొందేలా విధానాలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని లేనిపక్షంలో కార్మిక కర్షకులు ప్రజలు ఏకమై గద్దె దించుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
నాలుగు కార్మిక కోడ్ చట్టాలు రద్దు చేయాలి
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాలో కార్మిక, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, నిరసనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని, ఒప్పందబయటపని ఉద్యోగులను శాశ్వతం చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. తిర్యాణిలో జరిగిన నిరసనలో యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గేడం టీకానంద్ మాట్లాడుతూ కార్మికుల హక్కులు హరించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గుండం శంకర్, కాంగ్రెస్ నాయకులు పెరుమాండ్ల వెంకటేశం గౌడ్, బుద్ధే విజయ్, వ్యాపార సంఘం గౌరవ అధ్యక్షుడు సుద్దాల తిరుపతి, అధ్యక్షుడు జంగు, మధ్యాహ్న భోజన కార్మికుల నాయకురాలు చంద్రకళ, అంగన్వాడీ నాయకురాలు ఆత్రం పార్వతి, ఆశా కార్యకర్త ఆత్రం బద్రుబాయి, పరిశుద్ధ కార్మికులు అడ లక్ష్మణ్, చిలుక రవి, ఆత్రం మారుతి, రాము, సురేష్, వేముల రాజ్కుమార్, గోల్కొండ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
కాగజ్నగర్లో నిర్వహించిన ర్యాలీలో కార్మిక సంఘం సీనియర్ నాయకుడు ముంజం శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమన్వయకర్త ముంజం ఆనంద్ కుమార్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్, కార్మిక సంఘం జిల్లా ఖజాంచి ఈ. శంకర్, సిర్పూర్ కాగితం కర్మాగార కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కూషన రాజన్న, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకరి సాయి కుమార్ పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసనలో యువజన సంఘం జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం నిఖిల్, సహాయ కార్యదర్శి వడ్లూరి శ్రీకాంత్ పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలి
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో లేబర్ కోర్టు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ పార్క్ నుండి ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు రాజన్న రామ్‌లక్ష్మణ్ ఎస్‌ఎన్‌రెడ్డి నూతన్ కుమార్ సురేష్ కుమార్ గఫూర్ మహమూద్ తదితరులు ఉన్నారు.