13-02-2026 01:01:17 AM
ఎన్నికల్లో పోటీకి టికెట్ ఇవ్వడం.. ఆపై అభ్యర్థులను కాపాడుకునేందుకు పార్టీల తండ్లాట..
పోటాపోటీగా అభ్యర్థులను తరలిస్తున్న ప్రధాన పార్టీలు
* ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పరిహాసమయ్యే వేళ.. రాష్ట్రంలో మున్సిపోల్స్ ఓట్ల లెక్కింపు మొదలుకాకముందే క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. పార్టీలు టికెట్లు ఇచ్చి పోటీకి నిలిపిన అభ్యర్థులనే.. ప్రత్యర్థి పార్టీల నుంచి కాపాడుకోవాల్సిన దుస్థితి! పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడనివారు, ప్రజల తీర్పును గౌరవించనివారు.. ప్రలోభాలకు లొంగి పార్టీమారే సందర్భం మళ్లీ వచ్చింది.
ఎన్నికలను ప్రశ్నార్థకం చేసే మరో నాటకానికి.. గెలిచే అభ్యర్థులు వేదికను సిద్ధం చేసుకునే సమయమిది! క్యాంపు రాజకీయాలతో పార్టీలు తమ బలాబలాలను నిగ్గుతేల్చుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలకు చెక్ పెట్టకపోతే భవిష్యత్‌లో ఎన్నికలకు అర్థంలేకుండా పోతుందనే వాదన ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. పార్టీ ఫిరాయింపుల చట్టం కఠినంగా అమలు చేయకపోవడం.. గయారాంలను పార్టీలు వెలివేసేలా చర్యలు లేకపోవడం ఈ గందరగోళానికి ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : రాష్టంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులను కాపాడుకునేందుకు అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీలు పోటీపడి క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టాయి. పురపాలక ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం వివిధ రాజకీయ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది.
ఎన్నికల ఫలితాల వేళ అభ్యర్థులు చేజారకుండా నిర్వహిస్తున్న క్యాంపు రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తమ అభ్యర్థులెవరూ చేజారకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పాటు తమకు అందిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా.. ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీచేసిన తమ అభ్యర్థులందరిని శిబిరాలకు తరలిస్తున్నాయి.
కొన్ని మున్సిపాలిటిల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందనే స్పష్టత లేకపోవడంతోనే క్యాంపు రాజకీయాలకు తెరలేపా రు. అయితే బుధవారం జరిగిన ఈ ఎన్నికకు సంబంధించి శుక్రవారం ఫలితాలు వెలువడబోతున్నాయి. ఓట్ల లెక్కింపు మొదలుకాక ముందే.. పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సూర్యాపేట, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో క్యాంపు రాజకీయాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు క్యాంపు లు ఏర్పాటు చేస్తున్నాయి. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి బీఆర్‌ఎస్‌కు చెందిన 48 వార్డులకు చెందిన అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్, బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిలు తమ పార్టీల అభ్యర్థులను క్యాంపులకు తరలించారు.
ఇక మంచిర్యాల జిల్లా చెన్నూర్, కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని ఉద్దేశంతో ఇటు కాంగ్రెస్, అటు బీఆర్‌ఎస్ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి సెగ్మెంట్ కావడంతో ఈ రెండు స్థానాలను కైవసం చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బీఆర్‌ఎస్ అభ్యర్థులను బుధవారం రాత్రే క్యాంపులకు తరలించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
పార్టీ సూచన మేరకు అభ్యర్థులు సైతం తమ లగేజ్ ని సర్దుకుని క్యాంపుల బాట పడుతున్నారు. వీరినందరిని హైదరాబాద్ శివారుల లోని ఫామ్ హౌస్‌ల్లో ఏర్పాటు చేసిన క్యాం పులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయి నేతలతో మంతనాలు జరిపేందుకు వీలుగా రాజధాని శివారు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
సెమీ ఫైనల్స్‌లో పైచేయి కోసం..
సాధారణంగా మున్సిపల్ ఎన్నికలు అంటేనే మినీ సంగ్రామంగా భావిస్తుంటారు. క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలను నిరూపించేంది ఈ ఎన్నికలే. ఈ ఎన్నికల కోసం ఎంత కష్టపడ్డాం.. ? ఎన్ని వార్డులు గెలిచామన్నది కాకుండా.. ఎన్ని మున్సిపాలిటీలు, ఎన్ని కార్పొరేషన్లు మన ఖాతాలో వేసుకున్నామన్నదే రాజకీయ పార్టీల గెలుపునకు గీటురాయిగా నిలుస్తుంది.
తెలంగాణ లో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెం డం.. భవిష్యత్తులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇవే సెమీ ఫైనల్స్ అనే ప్రచారం జరుగుతోంది. దీంతో రాష్ర్టంలో భవిష్యత్ రాజకీయాలకు రూట్ మ్యాప్‌ను డిసైడ్ చేసే ఈ ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. గెలిచిన తమ అభ్యర్థులు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరి ఈ క్యాంపు రాజకీయాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నా యనేది శుక్రవారం వెలువడబోయే ఫలితాల్లో తేలనుంది. అయితే ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గాల్సిన అవసరనం ఉందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. అంతేకా కుండా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కఠినంగా అమలుచేయకపోవడం వల్లే ఇలాంటి దుస్థికి కారణమంటున్నారు. ఒక పార్టీలో గెలిచి.. మరొర పార్టీలోకి మారకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.