లంబాడాలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి
లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్
తాడ్వాయి, జూలై 1 (విజయ క్రాంతి): లంబాడాలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో లంబాడ హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి తండాలో, మండల కేంద్రాలలో జెండాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. లంబాడాలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. లంబాడాల సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు.
లంబాడాలు రాష్ట్రంలో మూడో స్థానంలో ఉన్నారని అయినా మనకు అధికారాలు లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా లంబాడాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






