కేటీఆర్ వ్యాఖ్యలు అబద్దాలు
ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్కొన్నారు. కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పై అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని, వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఘాటుగా స్పందించారు.
శాసనసభ సాక్షిగా కేటీఆర్ చేసిన విమర్శలకు ఆయన ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఎల్లారెడ్డిలో జరిగిన ట్రాక్టర్ దాడి ఘటన పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ఆ ఘటన కేవలం ఇరువురి మధ్య ఉన్న వ్యక్తిగత సమస్యల వల్ల జరిగింది తప్ప.. అందులో కాంగ్రెస్ పార్టీకి , ఎమ్మెల్యేగా తనకు ఎలాంటి ప్రమేయం లేదు. వ్యక్తిగత గొడవలను కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి రాజకీయం చేయడం కేటీఆర్ దిగజారుడు తనానికి నిదర్శనం అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడితే, ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఎందుకు బ్రహ్మరథం పడతారని ఆయన ప్రశ్నించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటో గత మున్సిపల్ ఎన్నికలే నిదర్శనమని ఎమ్మెల్యే గుర్తుచేశారు. మున్సిపాలిటీలోని 12 వార్డులకు 11 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, బీఆర్ఎస్‌ను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని స్పష్టం చేశారు.
ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదని, ఆ చేదు నిజాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజల విశ్వాసం కోల్పోయి, ఎన్నికల్లో డిపాజిట్లు పోగొట్టుకున్న వారు.. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పి రాజకీయ లాభం పొందాలని చూడటం హాస్యాస్పదమని ఎమ్మెల్యే అన్నారు. నిజం ఎప్పటికైనా బయటపడుతుందని, కేటీఆర్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని హితవు పలికారు. ఎల్లారెడ్డి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మదన్ మోహన్ పునరుద్ఘాటించారు.




