సంస్కృతి దుస్తుల్లో కాదు.. మదిలో ఉంటుంది!
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ రక్షాబంధన్ జ్యువెలరీ యాడ్ వివాదాస్పదంగా మారింది. ఈ ప్రకటనలో కృతి సనన్ వేసుకున్న దుస్తులపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన రాఖీ పండుగ యాడ్‌లో గ్లామర్ షో చేయడంతో పాటు ఒక పెంపుడు కుక్కకు రాఖీ కట్టిన సన్నివేశంపై కొందరు నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.
పండుగ సమయంలో అలాంటి దుస్తులు వేసుకోవడం పద్ధతి కాదని, కుక్కకు రాఖీ కట్టడం ఏంటని ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఈ వివాదంపై కృతి తాజాగా సనన్ స్పందించింది. ఇనాన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ కీలక నోట్ విడుదల చేస్తూ.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. “ఏ పండుగైనా సరే, దానికి ఉన్న అసలు ప్రాముఖ్యత మనం వేసుకునే బట్టల్లో ఉండదు. ఆ పండుగ వెనుక ఉండే ప్రేమ, భావోద్వేగాల్లోనే ఉంటుంది.
రక్షాబంధన్ అంటే ఒకరినొకరు కాపాడుకుంటామని ఇచ్చే బంధం. ప్రతి ఏటా నేను, నా చెల్లెలు ఒకరికొకరు రాఖీ కట్టుకుంటాం. ఒక అన్నయ్య ఏ రకంగా కాపాడతాడో, మేము కూడా అలాగే ఒకరికొకరు తోడుగా ఉంటాం. అలాగే మా ఇంట్లోని పెంపుడు కుక్కలు కూడా మా కుటుంబ సభ్యులే. అందుకే వాటికి కూడా రాఖీ కట్టి ఈ ప్రేమను పంచాం.
ఇప్పటికీ ఆడవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో వేరేవాళ్లు చెప్పడం ఏంటి? నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు?! కాలంతో పాటు ఫ్యాషన్ ఎంతో మారినప్పటికీ, ఒక మహిళ తన సంస్కృతికి ఎంత గౌరవం ఇస్తుందో ఆమె వేసుకునే దుస్తులను బట్టి నిర్ణయించడం తప్పు. సంస్కృతి, సంప్రదాయాలు అనేవి మనుషుల మనసుల్లో, హృదయాల్లో ఉంటాయి.. వేసుకునే బట్టలు, మెడ భాగంలో కాదు” అంటూ కృతి సనన్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.






