నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు
2027 వరల్డ్ కప్‌పై కోహ్లీ వ్యాఖ్యలు
ప్రపంచకప్ ఆడడం ఎప్పుడూ గౌరవమే
బెంగళూరు, మే 15: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎక్కడ కనబడినా ఒకటే ప్రశ్న ఎదరువుతుంది. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతాడా లేదా? టీ20, టెస్టులకు గుడ్ బై చెప్పిన కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. యువక్రికెటర్ల నుంచి విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో కోహ్లీ వచ్చే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకుంటాడా అనే అంశంపై చర్చ జరుగుతూనే ఉంది.
తాజాగా దీనిపై కోహ్లీ ఆర్సీబీకి ఇచ్చిన ఇంటర్యూలో స్పందించాడు. క్రికెట్‌లో కొనసాగే విషయంలో తనకు స్పష్టత ఉందన్నాడు. అయితే ప్రతీసారీ తన నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని విరాట్ స్పష్టం చేశాడు. అలాంటి పరిస్ఖితులు తనకొద్దని చెప్పాడు. జట్టుకు విలువ తీసుకొస్తానని అనుకుంటే భాగమవుతాననీ, అలా కాకుండా ప్రతిసారీ నిరూపించుకోవాలని అంటే మాత్రం.. అక్కడ ఉండలేననీ చెప్పాడు. కష్టపడే విషయంలో తానెవరికీ తక్కువ కాదన్న కోహ్లీ వన్డేల్లో 40 ఓవర్ల పాటు ఈ బౌండరీ నుంచి ఆ బౌండరీ లైన్ వరకూ పరుగు పెట్టమంటే. ఎలాంటి ఫిర్యా దు లేకుండా ఆ పని చేస్తానన్నాడు.
50 ఓవర్లలో.. ప్రతి బంతి కూడా నాకు చివరిదే అన్నట్లుగా భావిస్తాననీ కోహ్లీ చెప్పుకొచ్చాడు. జట్టు కోసం నావల్ల ఏదైతే అది చేయడానికి సిద్ధంగా ఉంటాననీ తెలిపాడు. ఏదైనా సిరీస్‌కు రెండు మూడు వారాల ముందు సన్నద్ధత అయ్యే వ్యక్తిని కాదనీ, ఏడాదంతా రెడీగా ఉంటాననీ చెప్పాడు. భారత్ తరఫున వరల్డ్ కప్‌లో ఆడటం ఎప్పుడూ అద్భుతమేనన్న కోహ్లీ అది కేవలం తాను ఒక్కడినే తీసుకొనే నిర్ణయం కాదన్నాడు. ఇదిలా ఉంటే టెస్ట్ జట్టుకు సారథ్యం వహించడం ఎప్పుడూ గర్వకారణమేనని చెప్పాడు. విదేశాల్లో ఎన్నో అద్భుత విజయాలు సాధించామనీ, అప్పుడు టెస్టులకు స్వర్ణయుగంగా అభివర్ణించాడు.






