ప్రధాని మోడీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు
- మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దహనం..
- బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
- బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు హెచ్చరిక
ఖమ్మం, ఏప్రిల్ 22(విజయక్రాంతి): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ దుమారాన్ని రేపాయి. ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బుధవారం ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు దిశానిర్దేశంలో స్థానిక 1 టౌన్ అధ్యక్షులు నరేష్ గాడిల అధ్యక్షతన నగరంలోని ముత్యాలమ్మ గుడి సెంటర్ వద్ద బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ, ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధానిపై నోటిదురుసుగా ప్రవర్తించడం కాంగ్రెస్ సంస్కృతికి నిదర్శనమని ఈ సందర్భంగా నాయకులు మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, మల్లికార్జున ఖర్గే తన స్థాయిని మర్చిపోయి తెలివి తక్కువ ప్రేలాపనలు చేస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖర్గే తన వ్యాఖ్యలకు గాను వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఖమ్మం జిల్లా శాఖ తరపున డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వెంకట్ గొంగుర, రుద్ర ప్రదీప్, జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్తా, రవి రాథోడ్ మాట్లాడుతూ, ఇటువంటి వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ తన రాజకీయ పతనాన్ని కొనితెచ్చుకుంటోం దని ఎద్దేవా చేశారు. దళిత మోర్చా నాయకులు కోటమర్తి సుదర్శన్, రేగన్ ప్రతాప్ బండ్ల మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రధానిపై విమర్శలు చేయడం ఖర్గే అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు.
ముత్యాలమ్మ గుడి సెంటర్ వద్ద జరిగిన ఈ నిరసనలో జిల్లా నాయకులు బోయినపల్లి సురేష్, మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్, మార్తి ప్రసాద్, బోయినపల్లి శేఖర్ తదితరులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. పొట్టిమూతి జనార్దన్, పిల్లలమర్రి వెంకట్, డీకొండ శ్యామ్, మేడ సంపత్, అనగాని రామారావు హెచ్చరించారు. అర్బన్ అధ్యక్షులు వాకదాని రామకృష్ణ నేతృత్వంలో పట్టణ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మండల స్థాయి నాయకులు పాలేపు రాము, పొట్టిమూతి వాణి, తుమ్మ ఇందు, ఊరుకొండ ఖాదర్ కూడా ప్రసంగించారు. రుద్రగాని మాధవ్, బాజోజు కుమార్ కూడా పాల్గొని మల్లికార్జున ఖర్గే తీరును ఎండగట్టారు.






