6 July, 2026 | 9:57 PM

పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'

06-07-2026 08:53 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన నంది అవార్డు గ్రహీత, పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం' లభించింది. ఖమ్మం జిల్లాలోని లయన్స్ క్లబ్‌లో ఆదివారం సాయంత్రం మొగిలి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. గత 25 సంవత్సరాలుగా ప్రకృతి పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం విశేష కృషి చేస్తున్నందుకు ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

ఇప్పటివరకు ప్రకృతి ప్రకాష్ 24 రాష్ట్రస్థాయి అవార్డులు, 13 జాతీయ స్థాయి సేవా పురస్కారాలు, గౌరవ డాక్టరేట్‌తో పాటు ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ నంది అవార్డును కూడా అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న విద్యుత్ శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, నటుడు, నిర్మాత నామవారపు కాంతీశ్వరరావు, ఆర్ అండ్ బి శాఖకు చెందిన ఎర్ర రమేష్ పాలకుర్తి, సినీ భక్తి గీతాల గాయకుడు నాగచైతన్య చేతుల మీదుగా ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో మొగిలి ఎంటర్టైన్మెంట్ అధినేత మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.