3 June, 2026 | 2:53 AM

తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయం

03-06-2026 12:00 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి అభివృద్ధి వరకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. మంగళవారం మహేశ్వరం మండల కేంద్రంలోని పీఎస్త్వ్ర ఫంక్షన్ హాాల్లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణుల సమక్షంలో ఆమె గులాబీ జెండాను ఆవిష్కరించి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఆమె స్మరించుకున్నారు.అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కోట్లాది ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అలుపెరగని పోరాటంతో కేసీఆర్ నెరవేర్చారని అన్నారు.

ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, పదేళ్ల పాటు సమర్థవంతమైన పాలన అందించి సాగునీరు, విద్యుత్, సంక్షేమం, మౌలిక సదుపాయాల రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, త్వరలో ప్రారంభం కానున్న బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి మహేశ్వరం నియోజకవర్గం సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.