KCRపై కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి షాకిస్తూ... మేడ్చల్ మునీరాబాద్ లో కల్వకుంట్ల కవిత పార్టీ ఆవిర్భావ సభలో తన కొత్త పార్టీని టీఆర్ఎస్ (Telangana Rashtra Sena)గా ప్రకటించారు. అనంతరం కవిత మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలందరూ భాగస్వామ్యం అయ్యాయరని చెప్పారు. జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని పదిలంగా కాపాడుకున్నారని కొనియాడారు. కాలరాత్రిలో కాగడాల తెలంగాణ ఉద్యమకారులకు వెలుగునిచ్చిందని కవిత తెలిపారు. తెలంగాణ సమాజానికి కాంతిరేఖగా మారిందని పేర్కొన్నారు. మరోసారి బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేసుకున్నామన్నారు.
జాగృతి కార్యకర్తలు ఉద్యమానికి బలమైన సాంస్కృతిక పునాది ఇచ్చారని తెలిపారు. ఏ కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో అవి నిజం కాలేదని కవిత ఆరోపించారు. తాను అమ్మవారి భక్తురాలినన్న కవిత తనకు సింగరేణి అంటే చాలా ఇష్టం అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకుని ఊరూరా తిరిగానని సూచించారు. బతుకమ్మ వచ్చిన తర్వాత ఉద్యమానికి ఊపోచ్చిందన్నారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లైనా మన కలలు నెరవేరలేదని ఆరోపించారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమ రథం దారితప్పిందన్నారు. ''కేసీఆర్ మారిన మనిషి.... మన మనిషి కాదు.... మర మనిషి.. ఏ కష్టమొచ్చినా ఆ సారు రారు, ఎందుకంటే ఆయన మారిన మనిషి.. ఆయన గుంటనక్కల చేతిలో ఇరుక్కున్న మనిషి, మన మనిషి కాదు'' అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.






