25 July, 2026 | 8:32 PM

కేంద్ర మంత్రి రాజీనామా.. విద్యార్థుల ఘన విజయం

25-07-2026 07:13 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం దేశంలోని విద్యావేత్తలు, విద్యార్థి లోకం సాధించిన ఘన విజయమని మెట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఖుతుబోద్దీన్ పాషా అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందని ఆరోపించారు.

దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు,అవకతవకలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ, వివిధ విద్యార్థి సంఘాలు చేపట్టిన పోరాటాల ఫలితంగానే కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనైనా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా, పారదర్శకమైన రీతిలో పోటీ పరీక్షలను నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.