17 August, 2026 | 10:40 PM

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ కొనసాగించాలి

17-08-2026 08:43 PM

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

నర్సాపూర్ (చిలిపిచేడ్), ఆగస్టు 17: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలుస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం చిలిపిచేడ్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, రాస్తారోకోలో ఆమె పాల్గొని మాట్లాడారు.

పేద కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అప్పటి సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టి వేలాది కుటుంబాలకు భరోసా కల్పించారని అన్నారు. పథకాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా జాప్యం చేయడం సరికాదని విమర్శించారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను రద్దు చేసే ప్రయత్నాలు చేస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

అలాగే రైతులకు సకాలంలో యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, యాప్‌ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా అవసరమైన ఎరువులను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అశోక్‌రెడ్డి, ధర్మారెడ్డి, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.