కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ మహిళల హక్కు...
- మాజీ మంత్రి రామన్న
ఆదిలాబాద్, (విజయక్రాంతి): ఆడబిడ్డల కుటుంబాలకు అండగా నిలిచిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కోర్టు సాకుతో నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకులు జోగు రామన్న మండిపడ్డారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మహిళలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహానికి భరోసా కల్పించే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఆడబిడ్డ కుటుంబానికి అండగా నిలుస్తూ రూ. 1.16 లక్షల ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ. 13 వేల కోట్లను లబ్ధిదారులకు అందించినట్లు పేర్కొన్నారు.
ఇలాంటి బృహత్తర సంక్షేమ పథకాలను నిలిపివేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. ఆడబిడ్డల కుటుంబాలకు అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించే నిరసన కార్యక్రమానికి మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు అజయ్, ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, యూనిస్ అక్బని, సాజితోద్దీన్, స్వరూప రాణి, భోడగం మమత,కాస్తల ప్రేమల తదితరులు పాల్గొన్నారు..






