3 August, 2026 | 4:14 AM

కాళేశ్వరం కూళేశ్వరం కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక

03-08-2026 01:45 AM

కాంగ్రెస్ మంత్రులకు గ్రావిటీపై అవగాహన లేదు బీఆర్‌ఎస్ నేతల ధ్వజం

ధర్మపురి/చొప్పదండి,ఆగస్ట్2(విజయక్రాంతి):కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనమని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టని, ఇది ’కూళేశ్వరం’ కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ’కాళేశ్వరం బాట’ కార్యక్రమంలో భాగంగా గులాబీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించారు.

మాజీ ఎంపీ వినోద్కుమార్ మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి బ్యాక్వాటర్ను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి మేడారం నంది పంప్హౌజ్, రామడుగు గాయత్రి పంప్హౌజ్ల వద్ద కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు..

ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్హౌజ్ వరకు గ్రావిటీ లేదంటూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి: 140 మీటర్లు మేడారం నంది పంప్హౌజ్: 230 మీటర్లు,రామడుగు గాయత్రి పంప్హౌజ్: 331 మీటర్లు,రామడుగు వద్ద గాయత్రి పంప్హౌజ్లో 115 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మిడ్మానేరులోకి నీరు తరలివెళ్తుందని స్పష్టం  చేశారు. తెలంగాణలో కరువుకు కాంగ్రెస్ పాలనే కారణమని ఆరోపించిన బీఆర్‌ఎస్ నేతలు.. మోటార్లు నిరంతరం ఆన్ చేసి, ఉత్తర తెలంగాణలోని జలాశయాలన్నింటినీ నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.