నేడు జ్యోతిబాపూలే ప్రతిభా పురస్కారాలు
ప్రభుత్వ పాఠశాలల టెన్త్ మండల టాపర్లు 629 మందికి అవార్డు ప్రదానం
హాజరుకానున్న డిప్యూటీ సీఎం, మంత్రులు
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా 629 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 2025- విద్యా సంవత్సరం పదవ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా పూలే ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ (బీసీటీఏ) నిర్ణయించింది. ఈ మేరకు బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.కృష్ణుడు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీలు హాజరై విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడం ఈ పురస్కారాల ప్రదాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల హవా నడుస్తున్న నేటి పరిస్థితుల్లో ప్రభుత్వ బడుల్లో చదివి మండల టాపర్లుగా నిలవడం అభినందనీయమని, వేలాది మంది విద్యార్థులకు ప్రేరణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఒక్కో మండలం నుంచి ఒకరు చొప్పున మొత్తం 629 మంది విద్యార్థులకు అవార్డులు అందజేస్తామన్నారు.






