కాళేశ్వరం కేసులో న్యాయం గెలిచింది..
- పీసీ ఘోష్ కమిష్ప హైకోర్టు తీర్పుకు హర్షం..
- మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు
- యం. పద్మ దేవేందర్ రెడ్డి..
మెదక్, ఏప్రిల్ 22(విజయ క్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పును మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం.పద్మ దేవేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడం న్యాయం గెలిచినట్లేనని పేర్కొన్నారు. కమిషన్ విచారణలో ప్రాథమిక న్యాయ నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన బలం లేదని తేలిందన్నారు.
ముఖ్యంగా సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలక పరిణామమని తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై రాజకీయ ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్లను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడిందని విమర్శించారు. అయితే న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడగా చివరకు నిజం గెలిచిందని అన్నారు. తెలంగాణ జీవధారగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కక్షపూరితంగా వ్యవహరించాయని ఆరోపించారు.
ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు రెండున్నరేళ్లు ఆలస్యం చేశారని, గత్యంతరం లేక ఇప్పుడు పనులు ప్రారంభిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్ పై చేసిన ఆరోపణలు నిరాధారమని ఈ తీర్పుతో స్పష్టమైందని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఈ తీర్పుతో కనువిప్పు కలగాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే విశ్వాసానికి ఈ హైకోర్టు తీర్పు నిదర్శనమని తెలిపారు.






