4 May, 2026 | 2:09 AM

ఒకే ఒక వేసవికాలం

04-05-2026 12:56 AM

అంతా అయిపోయింది 

అందరూ చేతులెత్తేశారు

ఇక అంతా అయిపోయిందని 

గొంతెత్తి చెపుతున్నారు 

కాలం మారింది 

యుద్ధ తంత్ర విద్య

మిథ్యా మంత్రంగా మారింది 

తాను పట్టిన 

కుందేలుకు మూడు కాళ్లు

ఒక ఎండమావుల 

కాలం కొనసాగుతుంది


నిన్న మొన్న తొడుక్కున్న వస్త్రాలు 

విడిచి కాలం చాకిరేవుకు అప్పగించింది

పచ్చని లేచిగుర్ల దుస్తువులను

ప్రకృతి దర్జీ రహస్యంగా కుట్టి

చెట్టుకు బహుమతిగా ఇచ్చింది

ఒక వెలుగు నీడల అసమయం నడుస్తున్నది

ఇంతకాలం నిరాకరించిన దాన్ని

ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు 

ఇంతకాలం వ్యతిరేకించిన దాన్ని 

ఇప్పుడు అందరూ ఆమోదిస్తున్నారు

ఒక బతికున్న శవయాత్ర ఛిసాగుతున్నది 


పునాదిలో  కదలిక

ఉపరితలంలో ఒక బడళిక

అందరూ చిటికె లేస్తూ 

ఆవులింతలు తీస్తున్నారు 

అందరూ  వేడి పకోడీలా 

సెగలు పొగలు కక్కుతున్నారు 

ఒక దింపుడుకల్లం ఆశ విడితిపోనంటున్నది


నిలుచున్న సిగ్నల్ టవర్స్  

నేల కూలిపోతున్నాయి

తలెత్తుకున్న జాజు రంగు స్తూపాలు 

ఎదురుగాలికి దీపాల్లా ఆరిపోతున్నాయి

ఒక త్యాగ రాగాల ఊరేగింపు 

కొనసాగుతున్నది

ఊర్లను ఖాళీచేసి

అడవిని అడ్రస్‌గా మార్చుకుంది

అభివృద్ధి అర్థం మారిపోయింది 

ఆయుధం గొంతు 

పొలమారిపోయింది

ఒక లొంగుబాటు 

పశ్చాత్తాపం ప్రకటిస్తున్నది

నీకు ఒప్పు అనిపించింది 

ఇతరులకు తప్పు అనిపిస్తుంది 

వేరొకరికి తప్పు అనిపించింది 

నీకు ఒప్పుగా కనిపిస్తుంది

ఒక సంక్లిష్ట భగ్న కలల 

రాత్రి నడుస్తున్నది


బుద్ధుడు పూలే అంబేడ్కర్  

ఎంత చెప్పినా చెవికి ఎక్కదు

మరోపక్క మార్క్స్ లెనిన్ మావో 

బొమ్మ తుపాకీ యుద్ధఫలం దక్కదు

కర్తలు కర్మలు స్వర్గ నరకాలు 

మడి కట్టిన దైవం తొంగి చూస్తున్నది

ఒక సమాచార అనారిక క్రీడ సాగుతున్నది


ఇక ఏమీ మిగిలిపోలేదని 

అందరూ చేతులెత్తేశారు 

తమను తాము పండ్లో అని 

అమ్ముకొని.. అమ్ముకొని  

అందరూ తకాయించి పోయారు

ఒక దళారి సంత కొనసాగుతున్నది

బూడిద కింద నిజం నిప్పును

కప్పి పుచ్చుతున్నారు 

ప్రశ్న సూదిని ముల్లె కడుతున్నారు 

రాసికి రాని రంగానికి రాని

ఒక ఎద్దు ఎనుపోతు వ్యవసాయం చేస్తున్నారు

చెర్ల నీళ్లు చెరువు వెనుక పడ్డాక 

ఊము తడి కన్పీటి సంతాపం తెలుపుతున్నారు

పొంతన లేని చింతన సభలు పెడున్నాన్నారు


అంతా అయిపోయిందని 

అందరూ చేతులెత్తేస్తున్నారు

సమస్యల్ని అనామతు పద్దులో నెట్టేస్తున్నారు

చూపు ఉన్నా గుడ్డివాళ్లు 

కాళ్లు ఉన్నా అవుటివాళ్ళు 

చెవులున్నా చెవిటి వాళ్ళు

భర్తల్ని చంపి భార్యలకు పింఛన్లు 

మంజూరు చేస్తున్న ఒక రాజ్యం నడుస్తున్నది

న్యాయ దేవత కళ్ళకు కట్టిన 

గంతలు విప్పినా

అమాయకులు జైళ్ల లో మగ్గుతున్నరు  

అన్యాయం రాజ మార్గంలో ఒళ్ళు 

విరుచుకు తిరుగుతున్నది ఒకేవొక 

వేసవి కాలం 

సాగుతున్నది.

జూకంటి జగన్నాథం